ఆ ఐడియా వర్కవుట్ అవుతుందా?

November 04, 2016
img

సాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు రాజకీయ పార్టీలు ఓటర్లని ప్రభావితం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఇద్దరూ కూడా అటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తన ప్రత్యర్ధి హిల్లరీపై స్వల్ప ఆధిక్యత సాధించడంతో ట్రంప్ వర్గంలో ఆశలు మళ్ళీ చిగురించాయి. కనుక ఆయన 8వ తేదీ రాత్రి మన్-హటన్ లో ఒక స్టార్ హోటల్లో తన మద్దతుదారులకి ‘విక్టరీ పార్టీ’ని ఏర్పాటు చేస్తున్నారు. 

కానీ దాని ప్రధానోద్దేశ్యం తనే అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికకాబోతున్నట్లు ఓటర్లని నమ్మించే ప్రయత్నమేనని భావించవలసి ఉంటుంది. ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉండగా ఎన్నికలకి ముందే విజయోత్సవాలకి ట్రంప్ సన్నాహాలు మొదలుపెట్టడం ద్వారా ఓటర్లకి తనే గెలువబోతున్నట్లుగా బలమైన సంకేతాలు పంపి, వారిలో ఊగిసలాడుతున్నవారిని కూడా తనవైపు ఆకర్షించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పవచ్చు.

అయితే విశేషం ఏమిటంటే మళ్ళీ తాజా సర్వేలో హిల్లరీ క్లింటన్ కొద్దిగా ఆధిఖ్యత సాధించగలిగారు. ఆమెకి 45 శాతం మద్దతు లభించగా ట్రంప్ కి 42 శాతం మద్దతు లభించింది. కనుక ఆమె వర్గం కూడా విజయోత్సవాలకి ఏర్పాట్లు చేసుకొంటోంది. రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇస్తున్న భారతీయ సమాజానికి ప్రాతినిద్యం వహిస్తున్న కొందరు ‘హిల్లరీ క్లింటన్ పాకిస్తాన్ అనుకూలవాది అని, ఆమెకి ఓటేసి గెలిపిస్తే భారత్ కి చాలా నష్టం కలుగుతుందని’ ప్రచారం చేసిన తరువాతనే ఆమె ఇంకా ఆధిక్యతలోకి రావడం విశేషం. 

ఇప్పటికే సుమారు 22మంది మిలియన్ ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తం అయ్యింది. కనుక మరో నాలుగు రోజులలో వారిద్దరిలో ఎవరు విజయం సాధించబోతున్నారో స్పష్టం అవుతుంది. అప్పుడు ఓడిపోయినవారు తమ విక్టరీ పార్టీని సంతాప సభగా మార్చుకోక తప్పదు. 

Related Post