ఎన్నికలొద్దు..నేనే అధ్యక్షుడిని!

October 28, 2016
img

అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 8న ఎన్నికలు జరుగబోతున్నాయి. అంటే నేటికి సరిగ్గా 10 రోజులు మాత్రమే సమయం మిగిలింది. ఈ సమయంలో రిపబ్లికన్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ నిన్న ఒహియోలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, “హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి ఏ మాత్రం అర్హురాలు కాదు. ఆమె చెపుతున్న విధానాలన్నీ పరమ చెత్తగా ఉన్నాయి. వాటి వలన దేశానికి ఏమాత్రం మేలు జరుగదు. కానీ ఆమెనే గెలిపించడానికి మీడియాలో కొన్ని బలమైన శక్తులు రిగ్గింగ్ చేయడానికి కుట్రలు చేస్తున్నాయి. కనుక తక్షణమే ఈ ఎన్నికలని రద్దు చేసి నన్ను విజేతగా ప్రకటించి నాకు అధికారం అప్పగించాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు. 

ఇటీవల వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన తాజా సర్వేలలో కొన్నిటిలో హిల్లరీ కంటే ట్రంప్ కొంచెం వెనుకబడిపోయినట్లు సూచిస్తుండగా, మరికొన్ని సర్వేలలో ఇరువురి మద్య చాలా స్వల్పమైన తేడా మాత్రమే కనిపించింది. కనుక ట్రంప్ విజయానికి దగ్గరలో ఉన్నప్పటికీ, దేశంలో జాతీయ మీడియాలో తనకి వ్యతిరేకంగా వస్తున్న వార్తలు, కధనాలు, విశ్లేషణలు, మహిళల పిర్యాదులు వగైరాలన్నీ దేశ ప్రజలని చాలా ప్రభావితం చేస్తున్నాయని ట్రంప్ గ్రహించారు. ఆ కారణంగా తన ఓటమికి అవకాశం ఉందని గ్రహించారు కనుకనే తనని ఓడించేందుకు మీడియా రిగ్గింగ్ కి పాల్పడుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారని చెప్పవచ్చు. కానీ కధ ఇంతవరకు వచ్చిన తరువాత ఈ సమయంలో మీడియా మేనేజ్ మెంట్ చేయడం ఆయనకి కూడా సాధ్యం కాదు. కనుక మీడియా కారణంగానే ట్రంప్ ఓడిపోయే అవకాశాలున్నాయి. అందుకే ట్రంప్ ఇటువంటి అసాధ్యమైన కోరిక కోరారని చెప్పవచ్చు. అది ఆయన అసహనానికి, నిసహాయ స్థితికి అద్దం పడుతున్నట్లుగా చెప్పవచ్చు. మిగిలిన ఈ 10 రోజులలో ఏదైనా అనూహ్యమైన సంఘటన జరిగితే తప్ప ట్రంప్ విజయావకాశాలు మెరుగుపడకపోవచ్చు. కనుక ఆ అద్భుతం జరగాలని ట్రంప్ భగవంతుని ప్రార్ధన చేసుకోవచ్చు.

Related Post