ట్రంప్, హిల్లరీ ముఖాముఖీ చర్చ

October 20, 2016
img

అమెరికా అధ్యక్ష ఎన్నికలకి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్స్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ల మద్య చిట్టచివరి ముఖాముఖి చర్చ కొద్ది సేపటి క్రితం పూర్తయింది. అమెరికా కాలమాన ప్రకారం బుదవారం రాత్రి (భారత్ లో గురువారం ఉదయం) లాస్ వెగాస్ యూనివర్సిటీలో థామస్ అండ్ మాక్ సెంటర్ లో ఈ చర్చ జరిగింది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులని వెనక్కి తిప్పి పంపేయడం, ఇరాక్, సిరియా యుద్దాలలో అమెరికా పాత్ర, ఉగ్రవాదం, దేశ ఆర్ధిక విధానం, విదేశీ విధానం, ఆరోగ్య విధానం, అబార్షన్లు వంటి అనేక అంశాలపై వారిరువురూ తమ తమ అభిప్రాయాలని సమర్ధించుకొంటూ వాదనలు చేశారు. 

గత రెండు చర్చలకి భిన్నంగా ట్రంప్ ఈసారి స్టేజిపై చాలా హుందాగా వ్యవహరించడం విశేషం. అదేవిధంగా హిల్లరీ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కలుగజేసుకోకుండా ట్రంప్ ఈసారి చాలా నిగ్రహం పాటించారు. ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చినప్పుడు వారిద్దరూ మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు. అలాగే చర్చ ముగించుకొని వెళ్ళిపోతున్నకూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు. వారిరువురి మధ్య శత్రుత్వం ఎంతగా పెరిగిపోయిందో ఇది సూచిస్తోంది.

కానీ తాజా సర్వేల ప్రకారం ఆమె కంటే ట్రంప్ సుమారు 7 శాతం వెనుకబడిపోయినట్లు తేలింది. వివిధ మీడియా సంస్థలు, అనేక ఇతర సంస్థలు, ఒక యూనివర్సిటీ నిర్వహించిన తాజా సర్వేలో కూడా ఇదే విషయం రుజువయింది. మహిళల పట్ల ట్రంప్ వ్యవహార శైలి, వారి గురించి అనుచితంగా మాట్లాడిన మాటలు, మహిళా అభ్యర్ధి అయిన హిల్లరీ పట్ల ముఖాముఖీ చర్చలలో అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి కారణాల చేత దేశంలో సుమారు 52 శాతం మంది మహిళలు ట్రంప్ పట్ల వ్యతిరేకత కనబరిచినట్లు తాజా సర్వేలో తేలింది. ఈ కారణంగా ట్రంప్ హిల్లరీ క్లింటన్ చేతిలో ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి.        


Related Post