న్యూజెర్సీలో ఘోర రైలు ప్రమాదం

September 29, 2016
img

న్యూజెర్సీలో హోబోకేన్ నగరంలో ఈరోజు ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. అమెరికా కాలమాన ప్రకారం గురువారం ఉదయం 8.30 గంటలకి ఎన్.జె. ట్రాన్సిట్ ట్రైన్ అదుపు తప్పి పల్టీ కొట్టి ప్లాట్ ఫారం మీదకి దూసుకు రావడంతో ఒక ప్రయాణికుడు మరణించారు. మరో వందమంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. రైలు అదుపు తప్పి చాలా వేగంగా ప్లాట్ ఫారం మీదకి దూసుకు వచ్చి స్టేషన్ పైకప్పుకి ఆధారంగా ఉన్న స్థంభాలని డ్డీ కొనడంతో పైకప్పు అది కూలిపోయింది. దాని వలన ప్రమాద తీవ్రత ఇంకా పెరిగింది. 

ఉదయం చాలా రద్దీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరుగడంతో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. న్యూ యార్క్ నగరంలోని స్ప్రింగ్ వాలీ నుంచి హోబోకేన్ రైల్వే స్టేషన్ లోకి రైలు ప్రవేశిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. రైల్ నేరుగా తమ మీదకే దూసుకు రావడంతో స్టేషన్లో దాని కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు ప్రాణభయంతో అటు ఇటూ పరుగులు తీశారు. అదే సమయంలో స్టేషన్ పైకప్పు కూడా కూలిపోవడంతో చాలా మందికి గాయాలయ్యాయి. 

తక్షణమే అక్కడికి చేరుకొన్న సహాయ సిబ్బంది గాయపడిన వారిని వైద్య చికిత్స కోసం సమీప ఆసుపత్రులకి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారి పరిస్థితి, వారి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. ఈ ప్రమాద కారణంగా హోబోకేన్ రైల్వే స్టేషన్ని మూసివేశారు. అక్కడికి రావలసిన రైళ్ళని వేరే మార్గానికి మళ్ళించారు. 

ప్రమాదం జరిగిన రైలులోనే ఇంజన్ వెనుక బోగీలోనే ప్రయాణిస్తున్న భాగ్యేష్ షా అనే ఒక భారతీయుడు మీడియాతో మాట్లాడుతూ, “స్టేషన్ సమీపిస్తున్నప్పటికీ రైలు వేగం ఏమాత్రం తగ్గకపోవడం చూసి నేను చాలా కంగారుపడ్డాను. నేను ఏమి జరుగుతోందోనని చాలా ఆందోళనతో చూస్తుండగానే మా రైలు ప్లాట్ ఫారం మీదకి దూసుకుపోయింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ప్లాట్ ఫారం నేల మీద పడున్నాను. చుట్టూ జనాలు అరుస్తూ అటూ ఇటూ పరుగులు తీస్తూ కనిపించారు. అప్పుడు కానీ ఏమి జరిగిందో నాకు అర్ధం కాలేదు. అంత పెద్ద ప్రమాదం నుంచి నేను ప్రాణాలతో బయటపడ్డానంటే నమ్మలేకపోతున్నాను. నేను నిజంగా చాలా అదృష్ట వంతుడిని. నా పక్కనే కూర్చొన్న ఒక యువతి శిధిలాల క్రింద చిక్కుకొని విలవిలలాడుతుండటం నేను నా కళ్ళారా చూశాను,” అని చెప్పారు. 

Related Post