మోడీ చెప్పింది నిజమే! పాపం..పాక్ ప్రజలు

September 29, 2016
img

యూరి దాడుల తరువాత భారత్-పాక్ దేశాల మధ్య అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న దౌత్య యుద్ధంలో భారత్ పై చెయ్యి సాధిస్తోంది. అమెరికా ప్రముఖ దినపత్రిక భారత్ పట్ల పాక్ తీరుని తప్పు పడుతూ ప్రచురించిన  కధనంపై పాకిస్తాన్ మీడియాలో కూడా చర్చ జరిగింది. నవంబరులో ఇస్లామాబాద్ లో జరుగవలసిన సార్క్ దేశాల సమావేశాలకి భారత్ హాజరుకాకూడదని నిర్ణయించుకొన్న తరువాత, భారత్ కి మద్దతుగా భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా ఆ సమావేశాలకి హాజరు కాకూడదని నిశ్చయించుకొన్నాయి. పాకిస్తాన్ అనుచిత వైఖరి కారణంగానే తాము హాజరు కావడం లేదని సార్క్ అధ్యక్షత వహిస్తున్న నేపాల్ కి తెలియజేశాయి. 

తాజాగా అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి యష్టన్ కార్టర్ నిన్న అమెరికాలోని ఉత్తర డకోటాలో మినాట్ విమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, “గత 25సం.లలో ఈ అణ్వాయుధాలు కారణంగా ఆసియాలో పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. భారత్ ఒక భాద్యతాయుతమైన అణ్వస్త్ర దేశం కానీ అణ్వాయుధాల విషయంలో పాకిస్తాన్ వైఖరి ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంది. వాటి వలన అమెరికాకి ప్రమాదం ఏమీ లేకపోయినప్పటికీ, వాటి భద్రత కోసం ఆ దేశంపై అమెరికా ఒత్తిడి చేస్తూనే ఉంది. పాకిస్తాన్ అణ్వాయుధాలు సమకూర్చుకోవడాన్ని అమెరికా ఎన్నడూ ప్రోత్సహించనప్పటికీ కొన్ని దేశాలు దానిని ప్రోత్సహించి సహకరించాయి. కానీ భారత్ మాత్రం ఈ విషయంలో ఎప్పుడూ చాలా బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తోంది,” అని అన్నారు. 

పాక్ తీరుని భారత్ తప్పు పట్టడం సహజమే కానీ అమెరికాతో సహా ప్రపంచ దేశాలు కూడా దానిని తప్పు పడుతున్నాకూడా అది తన వైఖరిని సమర్ధించుకొంటూ వితండవాదం చేస్తోంది. దాని వలన చివరికి పాకిస్తాన్, దాని ప్రజలే తీవ్రంగా నష్టపోతారు తప్ప భారత్ కాదని గ్రహించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ మొన్న కేరళలో మాట్లాడుతూ గత ఏడు దశాబ్దాలలో పాక్ పాలకులు అనుసరించిన టప్పుడు విధానాలకి పాక్ ప్రజలు బలవుతున్నారని, నేటికీ వారు తీరు మారలేదని అన్న మాటలు నిజమని పాక్ పాలకులు పదేపదే నిరూపిస్తున్నారు. దానిని ప్రపంచ దేశాలు కూడా ఈవిధంగా దృవీకరిస్తున్నాయి. అది పాక్ ప్రజల దురదృష్టం కాక మరేమిటి?  

Related Post