పాకిస్తాన్ కి వాల్ స్ట్రీట్ జర్నల్ సుద్దులు...చెవికెక్కుతాయా?

September 28, 2016
img

అమెరికాలో ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రస్తుతం భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి, భారత్-పాక్ వైఖరి గురించి చాలా ఆసక్తికరమైన కధనం ఒకటి ప్రచురించింది. దానిలో అది పాక్ వైఖరిని ఎండగట్టి, భారత్ సహనాన్ని అసమర్ధతగా భావించ వద్దని హెచ్చరించింది. యూరీ ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదుల దాడుల తరువాత కూడా భారత్ ప్రధాని నరేంద్ర మోడీ పాక్ తో యుద్ధం చేయాలనుకోకుండా చాలా వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారని మెచ్చుకొంది.

కానీ పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేయాలని భారత్ చాలా గట్టిగా ప్రయత్నిస్తుస్తోందని ఒకవేళ దాని ప్రయత్నాలు ఫలిస్తే పాక్ చాలా నష్టపోయే ప్రమాదం ఉందని గ్రహించాలని హితవు పలికింది. భారత్ పై జరుగుతున్న దాడులు పాక్ ప్రేరితమైనవేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత్ మౌనాన్ని, సహనాన్ని అసమర్ధతగా భావిస్తూ, ఇక ముందు కూడా పాకిస్తాన్ ఇదేవిధంగా వ్యవహరిస్తుంటే, భారత్ ఎదురుదెబ్బ తీస్తే పాకిస్తాన్ కోలుకోలేదని హెచ్చరించింది. భారత్ పట్ల ఇస్లామాబాద్ ఇదే వైఖరి కొనసాగిస్తే చివరికి పాకిస్తాన్ ఒక పనికిరాని దేశంగా మిగిలిపోతుందని హెచ్చరించింది. కనుక ఇప్పటికైనా పాక్ పాలకులు భారత్ పట్ల తమ వైఖరి మార్చుకొని అది అందిస్తున్న స్నేహ హస్తం అందుకొంటే దానికే మంచిదని హితవు పలికింది. 

భారత్ ఇరుగుపొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో చాలా కాలంగా మంచి సంబంధాలే ఉన్నాయి. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అవి మరింత బలపడ్డాయి. చైనానుంచి నేటికీ భారత్ తరచూ సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ, మొత్తంగా చూసినట్లయితే దానితో కూడా సంబంధాలు బాగానే ఉన్నట్లు చెప్పవచ్చు. భారత్ తో మంచి స్నేహ సంబంధాలు ఏర్పరచుకొన్నందుకు ఆ దేశాలకి భారత్ చాల బారీగా సహాయసహకారాలు అందిస్తోంది. కానీ ఆసియా దేశాలలో ఒక్క పాకిస్తాన్ మాత్రమే భారత్ స్నేహాన్ని తిరస్కరిస్తోంది. అయినప్పటికీ నాడు భారత్ మొట్ట మొదటి ప్రధాని నెహ్రూ మొదలు నేటి మోడీ వరకు భారత్ ప్రధానులు అందరూ గత ఏడు దశాబ్దాలుగా పాక్ తో స్నేహం కోసం ప్రయత్నిస్తునే ఉన్నారు. కానీ పాక్ మాత్రం భారత్ పై విషం కక్కుతూనే ఉంది. అది నానాటికీ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. అది పూర్తిగా కనిష్ట స్థాయికి రావాలంటే దానికి ఒకటే ఒక మార్గం. మళ్ళీ భారత్ తో యుద్ధం చేయడమే. కానీ భారత్ అందుకు సిద్దంగా లేకపోవడంతో గత 3-4 దశాబ్దాలుగా భారత్ తో పరోక్ష యుద్ధం అప్పుడప్పుడు కార్గిల్ వంటి ప్రత్యక్ష యుద్దాలు చేస్తూ ఆ దురద, కసి తీర్చుకొంటోంది. 

పాక్ ప్రభుత్వం మొహానికి కళ్ళెం తొడిగిన గుర్రం వంటిది. దానికి ఆ కళ్ళెం పాక్ సైనికధికారులే తొడిగారు. కనుక అది మరో పక్క చూడలేదు. ఇటువంటి హిత వాఖ్యాలు వినలేదు. ఒకవేళ విందామని, చూద్దామని ప్రయత్నించినా వారు చూడనివ్వరు..విననివ్వరు.  కనుక వాల్ స్ట్రీట్ జర్నలే కాదు...సాక్షాత్  అమెరికా అధ్యక్షుడే నచ్చ జెప్పినా వినే పరిస్థితిలో పాక్ లేదిప్పుడు.

Related Post