డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఎవరు అధిక్యత సాధించారు?

September 27, 2016
img

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల ప్రక్రియలో భాగంగా దానికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ మధ్య సోమవారం రాత్రి హెంప్ స్టడ్ లోని హోఫ్ స్ట్రా యూనివర్సిటీలో ముఖాముఖి చర్చ జరిగింది. దానిలో డోనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి తన ప్రత్యర్ధి హిల్లరీపై ఎదురుదాడి పద్దతిలోనే వాదించగా, హిల్లరీ క్లింటన్ ఏమాత్రం తొణకకుండా చిరునవ్వుతో ఆయనకి సమాధానాలు చెప్పారు. 

హిల్లరీ స్కోర్ సాధించిన అంశాలు:

ట్రంప్ చెపుతున్నట్లుగా పన్నులు తగ్గించడం వలన ధనవంతులకి ఇంకా మేలు జరుగుతుంది తప్ప సామాన్య, మధ్యతరగతి ప్రజలకి ఏమీ జరుగదు. సామాన్యులకి ఏదైనా ప్రయోజనం చేకూర్చగలిగేవే సరైన విదానాలని నేను నమ్ముతున్నాను అని అన్నారు. ఈ అంశంపై హిల్లరీ కొన్ని రోజుల క్రితం నిర్వహించిన ముఖాముఖి చర్చకి రాకుండా తప్పించుకొన్నారని ట్రంప్ విమర్శించినప్పుడు, అత్యున్నతమైన అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నప్పుడు, నేను ప్రజలకి చెప్పదలచుకొన్న విషయాల గురించి మరింత సంసిద్ధం అవడానికి కొంత సమయం తీసుకొంటే తప్పేమీ లేదు కదా? అని ఎదురుప్రశ్నించి ట్రంప్ నోరు మూయించారు. అది ఆమెకి చాలా మంచి స్కోర్ సంపాదించి పెట్టిందని సర్వేలో వెల్లడయింది.

పన్నులు తగ్గింపు గురించి మాట్లాడుతున్న ట్రంప్ తన ఆదాయం, దానికి ఆయన చెల్లిస్తున్న పన్ను వివరాలని ఎందుకు దాచిపెడుతున్నారని హిల్లరీ ప్రశ్నించారు. ఆయన పన్ను చెల్లించకుండా ఎగవేస్తునందునే ఆ వివరాలని దాచిపెడుతున్నారని హిల్లరీ అనుమానం వ్యక్తం చేశారు.

ఆమె తన ఈ-మెయిల్స్ కోసం ప్రైవేట్ సర్వర్ ని ఉపయోగించడాన్ని ట్రంప్ తప్పు పట్టి ఆమెని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయగా ఆయన ఊహించని విధంగా “అవును అది పొరపాటే. అందుకు నేను పూర్తి బాధ్యత స్వీకరిస్తున్నాను,” అని సంధానం చెప్పడంతో దానిపై వాదించేందుకు ఆయనకి అవకాశం లేకుండా పోయింది.

తనతో సహా మహిళల పట్ల ట్రంప్ చులకనగా మాట్లాడటం, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నల్లజాతి వ్యక్తి అని అనుచితంగా మాట్లాడటం, దేశంలో వివిధ జాతులు, మతాల ప్రజల ధ్య విద్వేషం పెంచేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలన్నీ హిల్లరీ క్లింటన్ ప్రస్తావించి అత్యున్నతమైన అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ తగిన వ్యక్తి కాడని వాదించారు.

ఆమె చెపుతున్న మాటలన్నీ ట్రంప్ నోటితో స్వయంగా అన్నవే కనుక ఆయన కూడా వాటిని ఖండించలేక ఎదురుదాడికి ప్రయత్నించారు. కానీ హిల్లరీ క్లింటన్ మాత్రం ఎక్కడా మాట తూలకుండా మొహంపై చిరునవ్వు చెదరనీయకుండా ట్రంప్ ని సమర్ధంగా ఎదుర్కొన్నారు. అందుకే ఆమెకి మంచి స్కోరు లభించిందని చెప్పవచ్చు.       

ట్రంప్ ఆధిక్యత సాధించిన అంశాలు:

దేశంలో అనేక పరిశ్రమలు, ఉద్యోగాలు విదేశాలకి తరలిపోతుండటం, ఆ కారణంగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుండటం, ఐసిస్ ఉగ్రవాదులని ఎదుర్కోవడంలో ఒబామా ప్రభుత్వం సరైన విధానం అవలంభించకపోవడం వలననే ఉగ్రవాదం ఇంకా పెరిగిపోయిందనే వాదనలకి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది.

చిన్న పిల్లల సంరక్షణ, ఉగ్రవాద జాబితాలో అనుమానితులుగా ఉన్నవారికి తుపాకులు అందకుండా నిషేదించాలానే హిల్లరీ వాదనతో తాను ఎకీభావిస్తున్నాని ట్రంప్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో తన రిపబ్లికన్ పార్టీ పునరాలోచించుకోవలసిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు ఆయనకి మద్దతు ఇస్తున్న నేషనల్ రైఫిల్ అసోసియేషన్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది.

వారి ముఖాముఖి చర్చా కార్యక్రమాన్ని చూస్తున్న లక్షలాది అమెరికన్ ప్రజలు హిల్లరీకే ఎక్కువ మొగ్గు చూపినట్లు సర్వేలలో తేలింది. సీ.ఎ.ఎన్.ఎన్.ఓ.ఆర్.సి. అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో హిల్లరీకి అనుకూలంగా 62శాతం మంది, ట్రాంప్ కి అనుకూలంగా కేవలం 27శాతం మంది మద్దతు పలికినట్లు తేలింది. 

Related Post