దేశాన్ని మళ్ళీ గాడిన పెడతా: జో బైడెన్‌

January 21, 2021
img

జో బైడెన్‌ బుదవారం అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత దేశ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇది అమెరికా ప్రజాస్వామ్య విజయం. గత నాలుగేళ్ళలో దేశప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అయినా అందరూ నిబ్బరంగా సవాళ్ళను ఎదుర్కొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. గతంలో కూడా అమెరికా ప్రజాస్వామ్యానికి అనేక సవాళ్ళు ఎదురయ్యాయి కానీ మన ప్రజాస్వామ్యం చాలా బలమైన వ్యవస్థ కనుక ఎటువంటి ఆటుపోట్లనైనా తట్టుకొని నిలబడుతోంది. జాతి వివక్షను అధిగమించి అమెరికాను మళ్ళీ అగ్రస్థానంలో నిలబెట్టడమే నా ధ్యేయం. అందుకు అమెరికాలోని ప్రతీ ఒక్కరూ సహకరించాలి. నాకు ఓట్లు వేసి గెలిపించినవారికి, ఓట్లు వేయనివారికి కూడా అధ్యక్షుడిగా పనిచేస్తూ అందరినీ సమానంగా చూసుకొంటాను. కరోనా మహమ్మారితో దేశప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దాని కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింది. అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. ముందుగా ఈ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను. అలాగే గత నాలుగేళ్ళలో మన మిత్రదేశాలతో చెడిన సంబంధాలను పునరుద్దరించుకొని వాటికి అండగా నిలబడతాను. అమెరికాతో పాటు మన మిత్రదేశాలలో కూడా శాంతి, అభివృద్ధి, భద్రత పెంచేందుకు కృషి చేస్తాను. మళ్ళీ ప్రపంచదేశాలతో అమెరికాను అనుసంధానం చేసి అమెరికా నాయకత్వంలో యావత్ ప్రపంచాన్ని అభివృద్ధిపదంలో నడిపిస్తాను,” అని అన్నారు. 

Related Post