అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం

January 21, 2021
img

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ బుదవారం ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా కాలమాన ప్రకారం బుదవారం ఉదయం 10.30 గంటలకు వాషింగ్‌టన్‌లోని క్యాపిటల్ హిల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ జో బైడెన్‌ చేత ప్రమాణం చేయించారు. ఆనవాయితీ ప్రకారం ముందుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోనియా సోటోమేయర్ కమలా హారిస్ చేత అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేయించారు. 

జో బైడెన్‌ కుటుంబం 127 సం.లుగా ఉపయోగిస్తున్న బైబిల్‌ను ఆయన భార్య జిల్‌ బిడెన్ చేతపట్టుకొని ఆయన పక్కన నిలబడగా, దానిపై చేతి నుంచి జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. జో బైడెన్‌ గతంలో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు, అంతకు ముందు ఏడుసార్లు సెనేటర్‌గా ఎన్నికైనప్పుడు కూడా అదే బైబిల్‌పై ప్రమాణం చేశారు. 

కమలా హారిస్‌ భర్త డగ్లస్ యెంహాఫ్ రెండు బైబిల్ పుస్తకాలు పట్టుకొని నిలబడగా వాటిపై ఆమె ప్రమాణం చేశారు. వాటిలో ఒకటి ఆమె స్నేహితురాలైన రెజినా షెల్టన్‌కు చెందినదికాగా మరోటి సుప్రీంకోర్టు తొలి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయమూర్తి జస్టిస్ థర్‌గుడ్ మార్షల్ ఉపయోగించిన బైబిల్.   

 

అత్యంత ఆహ్లాదకరమైన పండుగ వాతావరణంలో జరగాల్సిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం, ట్రంప్‌ మద్దతుదారులు దాడులకు పాల్పడవచ్చనే హెచ్చరికల నేపధ్యంలో సుమారు 25,000 మంది నేషనల్ గార్డ్స్ (సాయుధ బలగాలు) మద్య తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో జరిగింది. కనుక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఆద్యంతం సజావుగా సాగిపోయింది. 


Related Post