జో బైడెన్‌కు లైన్ క్లియర్

December 16, 2020
img

నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ అభ్యర్ధి జో బైడెన్‌ భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆయన ఆ పదవిని చేపట్టేందుకు చిట్టచివరి పరీక్షలో కూడా నేగ్గారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ, 538 మంది సభ్యులున్న ఎలక్టోరల్ కాలేజీలో కూడా మెజార్టీ సభ్యుల మద్దతు కూడా పొందవలసి ఉంటుంది. దానిలో జో బైడెన్‌కు అనుకూలంగా 306 ఓట్లు పడటంతో చివరి పరీక్షలో కూడా నెగ్గినట్లయింది. ఈ ఎన్నికలలో కూడా జో బైడెన్‌ నెగ్గితేనే ఆయన గెలుపును అంగీకరిస్తానని అంతవరకు వైట్‌హౌస్‌ ఖాళీ చేసేదిలేదని మొండికేసి కూర్చోన్న డోనాల్డ్ ట్రంప్‌ ఇక వైట్‌హౌస్‌ ఖాళీ చేసి జో బైడెన్‌కు అప్పగించక తప్పదు. ఈ చివరి పరీక్షలో కూడా జో బైడెన్‌ ఘనవిజయం సాధించడంతో జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. 

ఈ సందర్భంగా జో బైడెన్‌ దేశ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇది అమెరికా ప్రజాస్వామ్యపు గెలుపు. దశాబ్ధాల క్రితమే ప్రజాస్వామ్యమనే దీపాన్ని వెలిగించుకొన్నాము. దానిని ఏ మహమ్మారి, అధికార దుర్వినియోగం ఆర్పలేవని మరోసారి రుజువైంది. అధికారమనేది గుంజుకొంటే వచ్చేది కాదు...ప్రజలు మంజూరు చేస్తేనే వస్తుందని మరోసారి నిరూపితమైంది. ఇప్పటివరకు దేశానికి జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొన్న భయాలను అన్నిటినీ అధిగమించి చరిత్రలో ఆ పాత పేజీలను తిప్పేసి కొత్త అధ్యాయం మొదలుపెడదాము. ధైర్యంగా ముందుకు సాగుతూ అమెరికాను పునర్నిర్మించుకొందాము. అధ్యక్ష ఎన్నికలలో నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. అలాగే నాకు ఓటు వేయనివారిని కూడా నావారిగానే భావించి వారి అభివృద్ధి, సంక్షేమం కోసం మరింతగా శ్రమించి వారి హృదయాలలో కూడా స్థానం సంపాదించుకొంటాను. కోవిడ్19 కారణంగా దేశంలో అనేకమంది తమ ఆప్తులను కోల్పోయారు. వారందరికీ నా మనస్ఫూర్తిగా సంతాపం తెలియజేస్తున్నాను. ఇటువంటి విషాద శీతాకాల సమయంలో దేశం కోసం అందరూ కలిసి ధైర్యంగా అడుగు ముందుకు వేయక తప్పదు,” అని అన్నారు. 

Related Post