భారత్‌ గురించి జో బైడెన్‌ ఏమనుకొంటున్నారంటే...

November 25, 2020
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ హయాంలో భారత్‌-అమెరికాల మద్య కొన్ని విభేధాలు నెలకొని ఉన్నప్పటికీ ట్రంప్‌ భారత్‌ అనుకూలవైఖరి కారణంగా రెండు దేశాలమద్య సంబంధాలు బలపడ్డాయి. ఇప్పుడు ఆయన స్థానంలో జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా రాబోతున్నారు. కనుక భారత్‌ పట్ల జో బైడెన్‌ వైఖరి ఏవిధంగా ఉండబోతోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఆయన గతంలో, చైనా, పాక్‌ల పట్ల కాస్త మెతకవైఖరి అవలంభించారు కనుక ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తే మళ్ళీ ఆ రెండు దేశాలతో సమస్యలు మొదలవుతాయని భారత్‌ ఆందోళన చెందడం సహజం. జో బైడెన్‌కు కుడిభుజంగా చెప్పుకోబడుతున్న ఆంటోనీ బ్లికేన్‌, నిన్న మీడియా ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు చెప్పిన సమాధానం భారత్‌కు చాలా ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు. 

“భారత్‌-అమెరికాల మద్య దశాబ్ధాలుగా బలమైన స్నేహసంబంధాలున్నాయి. గతంలో ఒబామా-బైడెన్ ప్రభుత్వ హయంలో కూడా రెండు దేశాలు కలిసి పనిచేశాయి. ఇప్పుడూ ఆలాగే జరుగుతుంది. భారత్‌-అమెరికాలు రెండూ ఒకే సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదే.. చైనా విసిరే సవాళ్ళు. భారత్‌-చైనా సరిహద్దుల వద్ద చైనాతో  భారత్‌ చాలా సమస్యలు ఎదుర్కొంటోందని మాకు తెలుసు. అలాగే మాకూ చైనాతో సమస్యలున్నాయి. కనుక భారత్‌-అమెరికాలు కలిసి పనిచేయవలసి ఉంటుంది,” అని అన్నారు. 


జో బైడెన్‌ ప్రభుత్వంలో ఆంటోనీ బ్లికేన్‌ చాలా కీలకమైన సెక్రెటరీ ఆఫ్ స్టేట్(రక్షణ శాఖ)గా నియమితులు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కనుక ఆయన చెప్పిన ఈ మాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచినట్లు ప్రకటించగానే భారత్‌తో సహా పలుదేశాలు ఆయనకు, ఆయన బృందానికి అభినందనలు తెలిపాయి. కానీ చైనా, రష్యాలు మాత్రం ఆయనను అధ్యక్షుడిగా గుర్తించేందుకు నిరాకరించాయి. జో బైడెన్‌ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు చైనాపై యుద్ధం ప్రకటించినా ఆశ్చర్యంలేదని చైనా అంది. దాంతో ఆ రెండు దేశాలు చేజేతులా జో బైడెన్‌ను శత్రువుగా మార్చుకొన్నట్లయింది. దాని వలన వాటికేమీ నష్టం ఉండకపోవచ్చు కానీ చైనా దురహంకారంతో జో బైడెన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన ఈ నాలుగు మాటలే భారత్‌కు అమెరికా మరింత దగ్గరయ్యేందుకు ఉపయోగపడిందనుకోవచ్చు. 

Related Post