బైడెన్‌కు లైన్ క్లియర్...

November 24, 2020
img

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ అధ్యక్ష పదవి చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఇంతకాలం తన ఓటమిని అంగీకరించని డోనాల్డ్ ట్రంప్‌ ఎట్టకేలకు జో బైడెన్‌కు పాలనాధికార పగ్గాలు అప్పగించేందుకు ఇవాళ్ళ అంగీకరించారు. వైట్‌హౌస్‌లోని జనరల్ సర్వీసస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపారు. దీంతో జో బైడెన్‌ ఎన్నికను ట్రంప్‌ అంగీకరించినట్లయింది. కానీ తన న్యాయపోరాటం కొనసాగుతుందని ట్రంప్‌ ట్వీట్ చేశారు.

“గత కొన్నిరోజులుగా జనరల్ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్ ఎమిలీ మర్ఫీ ఎన్నో ఒత్తిళ్ళు వేధింపులు భరిస్తూ చాలా చక్కగా తన విధులను నిర్వర్తించారని, దేశం పట్ల ఆమె అత్యంత విధేయత, అచంచల విశ్వాసం కనబరిచారని ట్రంప్‌ ప్రశంశించారు. ఆమె ఇంకా ఒత్తిళ్ళు వేధింపులు భరిస్తుండటం సహించలేనని కనుక అమెరికా ప్రయోజనాల దృష్ట్యా అధికార బదిలీ ప్రక్రియను మొదలుపెట్టాలని ఆమెను, ఆమె బృందాన్ని కోరుతున్నాను,” అంటూ ట్రంప్‌ ట్వీట్ చేశారు. 

కనుక అధికార బదలాయింపులో ఇప్పటివరకు నెలకొన్న సందిగ్ధం తొలగిపోవడంతో జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టేందుకు చకచకా ఏర్పాట్లు మొదలవుతాయి. ఆయన జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

ఇప్పటివరకు వైట్‌హౌస్‌ వీడేది లేదు... కుర్చీ వదిలేదు అంటూ భీష్మించుకొని కూర్చోన్న డోనాల్డ్ ట్రంప్‌, ఏమి కొత్త తలనొప్పులు తెచ్చిపెడతారో అని జో బైడెన్‌ వర్గం సైతం ఆందోళన చెందుతోంది. కానీ ఎట్టకేలకు ట్రంప్‌ తనంతట తానే పదవిలో నుంచి తప్పుకొని జో బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సిద్దమవడంతో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు.

Related Post