అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్ ఘన విజయం

November 08, 2020
img

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ అభ్యర్ధి  జో బైడెన్‌ (పూర్తిపేరు జోసఫ్ రాబినెట్ బైడెన్‌ జూనియర్) గెలిచారు. అధ్యక్ష పదవి చేపట్టేందుకు కనీసం 270 ఓట్లు అవసరం కాగా సొంత రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో 20 ఓట్లు గెలుచుకోవడంతో జో బైడెన్‌కు మొత్తం 284 ఓట్లు దక్కాయి. దాంతో ఆయన ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలిచి అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంకా జార్జియా, నార్త్ కరోలినా, అలాస్కా రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అక్కడ ఎటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ జో బైడెన్‌ ఎన్నికపై ఇక ఎటువంటి ప్రభావం చూపదు. 

డెమొక్రాట్లు విజయం సాధించడంతో భారత్‌-ఆఫ్రికా సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 

దేశంలో మళ్ళీ శాంతియుతవాతావరణం నెలకొల్పి జాతీయ సమైక్యతను సాధిస్తానని జో బైడెన్‌ అన్నారు. మొట్ట మొదట దేశంలో కరోనా నివారణకు గట్టి ప్రయత్నాలు చేసి వీలైనంత త్వరగా దేశాన్ని కరోనా నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొని మళ్ళీ దేశాన్ని గాడిలో పెట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తానని అన్నారు. 

తన విజయంపై జో బైడెన్‌ స్పందిస్తూ “అమెరికా ఓ గొప్ప దేశం. దానికి నాయకత్వం వహించడానికి ప్రజలు నన్ను ఎన్నుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మీరు నాకు ఓటు వేసినా వేయకున్నా అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తాను. నా లక్ష్యం చాలా కటినమైనది. అయినప్పటికీ మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటాను,” అని ట్వీట్ చేశారు. 

కమలా హారిస్‌ కూడా స్పందిస్తూ, “ఈ ఎన్నికలు జో బైడెన్‌, నాకంటే దేశానికే ఎక్కువ అవసరం. ఇవి అమెరికా ఆత్మగౌరవంతో ముడిపడినవి. దానికోసం అందరం కలిసి పోరాడుదాం. మన లక్ష్యం సాధించేవరకు అందరం కలిసికట్టుగా పనిచేయడం ప్రారంభిద్దాం,” అని ట్వీట్ చేశారు.

2020, జనవరి 20వ తేదీన జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆయనతో పాటే కమలా హారిస్ కూడా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేస్తారు. 

Related Post