నా అధికారి డాక్టర్ ఫౌచీ ఓ మూర్ఖుడు: డోనాల్డ్ ట్రంప్‌

October 21, 2020
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసుకు మరో తాజా ఉదాహరణ ఇది. తన ప్రభుత్వంలో అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ ఓ మూర్ఖుడు అని అన్నారు.

లాస్వెగాస్లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో డోనాల్డ్ ట్రంప్‌ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ ఫౌచీ గత మూడు దశాబ్ధాలుగా పనిచేస్తున్నాడు. కానీ కరోనా గురించి ఏమి మాట్లాడుతాడో ఆయనకే తెలీదు. ఆయనో మూర్ఖుడు. నేను ఆయన మాటలు విని ఉంటే దేశంలో 5 లక్షల మంది కరోనాతో చనిపోయుండేవారు. ఆయన మాటలు వినీవినీ ప్రజలు కూడా విసుగెత్తిపోయారు. ఆయన వలన ఏ ప్రయోజనమూ లేదని ఇప్పుడు తేలిపోయింది,” అని ఎద్దేవా చేశారు.

అమెరికాలో కరోనా వ్యాప్తికి, మరణాలకు ట్రంప్‌ నిర్లక్ష్యం, చేతకానితనమే కారణమని ప్రత్యర్ద డెమొక్రాట్ పార్టీ మొదటి నుంచి వాదిస్తోంది. కరోనా తీవ్ర ప్రభావాలను అనుభవించిన అమెరికన్లను ఆ వాదనలు ఆలోచింపజేస్తాయని వేరే చెప్పక్కరలేదు. అందుకే డోనాల్డ్ ట్రంప్‌ మొదట దీనికంతటికి కారణం చైనాయేనని ప్రజలను నమ్మించేందుకు గట్టిగా ప్రయత్నించారు. అయినా ప్రజలు తన మాటలను నమ్మి ఓట్లేస్తారో లేదోనని ట్రంప్‌కు అనుమానం కలిగినట్లుంది. అందుకే ఇప్పుడు తన వైఫల్యాలను వైట్‌హౌస్‌లో కరోనా టాస్క్‌ఫోర్స్‌ అధినేతగా పనిచేస్తున్న అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీని బాధ్యుడిగా చేయాలని ప్రయత్నిస్తునట్లున్నారు. నవంబర్‌ 3న జరుగబోయే అధ్యక్ష ఎన్నికలలో గెలవాలంటే ఎవరో ఒకరిని బలి ఇవ్వక తప్పదని గ్రహించి డాక్టర్ ఆంటోనీ ఫౌచీని ప్రజల ముందు బకరాగా నిలబెట్టారు. అయితే అమెరికన్ ప్రజలకు ఆ మాత్రం విచక్షణా జ్ఞానం ఉండదని ట్రంప్‌ అనుకోవడమే అవివేకం.

Related Post