ట్రంప్‌ మనసులో కోరిక... తీరేనా?

August 29, 2020
img

నవంబర్‌ 3న జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా జో బిడెన్, ఉపాధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక జో బిడెన్‌ను డోనాల్డ్ ట్రంప్‌ ప్రత్యర్ధిగా భావించాలి కానీ ఆయన  బిడెన్ కంటే ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్‌నే ఎక్కువగా లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండటం విశేషం. ఆమె వలననే తన విజయావకాశాలు దెబ్బ తింటాయని బహుశః ట్రంప్‌ ఆందోళన చెందుతున్నట్లున్నారు. 

శుక్రవారం న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన  ఎన్నికల ప్రచారసభలో డోనాల్డ్ ట్రంప్‌ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఒక మహిళా అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నుకోబడితే నేను చాలా సంతోషిస్తాను. కానీ కమలా హారిస్‌ అసలు ఆ పదవికి పోటీ చేసేందుకే తగదు. ఆమె కంటే నా కూతురు ఇవాంకా ట్రంప్‌ మంచి అభ్యర్ధి అని నేను భావిస్తున్నాను. ప్రజలు కూడా ఇవాంకా ట్రంప్‌ అమెరికా అధ్యక్షురాలు కావాలని కోరుకొంటే వారిని నేను కాదనలేను కదా?” అని అన్నారు. 

కమలా హారిస్‌ భారత్, ఆఫ్రికా మూలాలు ట్రంప్‌ ఆందోళనకు కారణంగా కనిపిస్తున్నాయి. అమెరికాలో నల్లజాతీయులపై తరచూ జరుగుతున్న దాడుల కారణంగా వారు కమలా హారిస్‌వైపు మొగ్గు చూపే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. అలాగే ఆమె భారత్‌ సంతతికి చెందిన మహిళ కావడంతో అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఆమెకు, ఆమె కారణంగా జో బిడెన్‌వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇదే ట్రంప్‌ ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది. బహుశః అందుకే ఆయన బిడెన్ కంటే కమలా హారిస్‌పై ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నారనుకోవచ్చు. కానీ తద్వారా తన అభద్రతాభావాన్ని స్వయంగా బయటపెట్టుకొంటున్నారని ట్రంప్‌ గ్రహించినట్లు లేదు. 

కమలా హారిస్‌ను విమర్శిస్తూ ట్రంప్‌ తన కూతురు ఇవాంకా ట్రంప్‌ అమెరికా అధ్యక్షురాలు అయితే చూడాలనే తన మనసులో కోరికను అప్రయత్నంగానే బయటపెట్టుకొన్నారు. అదేమీ తప్పు కాదు కానీ ఈ ఎన్నికలలో ఆమె పోటీ చేయనప్పుడు అటువంటి ఆలోచన చేయడం అనవసరమే కదా?

ఈసారి అందరికీ తెలిసిన ఈ కారణాల వలన అధ్యక్ష ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్‌ ఎదురుగాలులు వీస్తున్నట్లే కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల ఆయన పాలనను రుచి చూసిన ప్రవాస భారతీయులు మళ్ళీ ఆయనకే ఓట్లు వేస్తారో లేదా ఈసారి ‘మన కమల’కే వేద్దామనుకొంటారో చూడాలి.

Related Post