ట్రంప్‌ సంచలన నిర్ణయం...

June 23, 2020
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అనేక కంపెనీలు మూతపడటంతో లక్షలాదిమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతితో భారంగా జీవితాలు గడుపుతున్నారు. ఈ నేపధ్యంలో విదేశీయులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పించడం వలన వారందరికీ ఆ మేరకు ఉద్యోగావకాశాలు కోల్పోతారు కనుక ఈ ఏడాది డిసెంబర్ 31వరకు హెచ్-1బీ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని డోనాల్డ్ ట్రంప్‌ ఆదేశించారు. ట్రంప్‌ ఆదేశాల మేరకు హెచ్-1బీ వీసాలతో పాటు, హెచ్-12బీ, జె-1, ఎల్-1 వీసాల జారీని కూడా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. 

అయితే ఇప్పటికే అమెరికాలో హెచ్-1బీ వీసాలపై వచ్చి ఉద్యోగాలు చేసుకొంటూ వాటి రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారిపై ఎటువంటి ఆంక్షలు విధించబోవడంలేదని, కాలపరిమితి ముగిసిన వీసాల రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. అత్యంత నైపుణ్యాలు కలిగిన వారికి మాత్రమే హెచ్-1బీ వీసాలు జారీ చేయాలనే ప్రతిపాదనను డోనాల్డ్ ట్రంప్‌ ఇదివరకే చేశారు. ఇకపై అటువంటివారికి మాత్రమే వీసాలు జారీచేయాలని భావిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు.

అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ ప్రస్తుతం కాస్త తగ్గినప్పటికీ దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నందున, అమెరికాలో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్ళాలా వద్దా? అనే అయోమయస్థితి సర్వత్రా నెలకొంది. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం నిర్ణయంతో ఆ అయోమయం పూర్తిగా తొలగిపోయినట్లే భావించవచ్చు.             

అమెరికాలో ఈరోజు వరకు 23,55,680 కరోనా కేసులు నమోదుకాగా వాటిలో 12,62,614 యాక్టివ్ కేసులున్నాయి. మళ్ళీ వాటిలో 16,510 క్రిటికల్ కేసులున్నాయి. ఇప్పటివరకు 7,33,094 మంది కోలుకొని ఇళ్ళకు తిరిగివెళ్ళగా 1,22,132 మంది కరోనా బారినపడి మరణించారు.

Related Post