అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రెట్ అభ్యర్ధిగా జోసెఫ్ బైడెన్ పోటీ

June 06, 2020
img

ఈ ఏడాది నవంబరులో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అధికార రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌ మళ్ళీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ తరపున జోసెఫ్ బైడెన్‌ ఆయనపై పోటీ చేయబోతున్నారు. పార్టీలో అభ్యర్ధి ఎంపికకు జరిగిన నామినేషన్లలో జోసెఫ్ బైడెన్‌కు అనుకూలంగా 1,991 ఓట్లు రావడంతో ఆయన స్వయంగా ఈవిషయం దృవీకరించారు. “అమెరికా ఆత్మను కాపాడేందుకు ట్రంప్‌తో పోటీ పడబోతున్నాని,” ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 

బారక్ ఒబామా హయాంలో జోసెఫ్ బైడెన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇది వరకు ఆయన రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు కానీ అవకాశం లభించలేదు. ఈసారి డెమొక్రాట్ పార్టీ అభర్ధిగా పేరు ఖరారు కావడంతో తప్పకుండా తన కల నెరవేర్చుకోవాలని జోసెఫ్ బైడెన్‌ చాలా పట్టుదలగా ఉన్నారు. 

ట్రంప్‌ దుందుడుకు వైఖరితో విసుగెత్తిపోయున్న అమెరికా ప్రజలు, ఇప్పుడు ఆయన కరోనాను నివారించడంలో కూడా విఫలం అవడం, ఆ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు ఆసుపత్రి పాలవుతుండటం, లక్షకు పైగా ప్రజలు కరోనాతో చనిపోవడం, లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం వంటివన్నీ భరించలేకపోతున్నారు. దాంకి తోడు ఇటీవల పోలీసుల చేతిలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడంతో దేశవ్యాప్తంగా ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, అల్లర్లు చెలరేగాయి. కనుక ఈ అనూహ్య విపరీత పరిణామాలన్నీ డెమొక్రాట్ అభ్యర్ధి జోసెఫ్ బైడెన్‌కు అనుకూల అంశాలుగానే భావించవచ్చు. కానీ డోనాల్డ్ ట్రంప్‌ సత్తాను తక్కువ అంచనా వేయలేమని గత ఎన్నికలలోనే స్పష్టమైంది. అయితే డెమొక్రాట్లకు ఇటువంటి గొప్ప అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కనుక వాటిని అందిపుచ్చుకొని అధికారం చేజిక్కించుకొనేందుకు గట్టిగానే ప్రయత్నించడం ఖాయం.

Related Post