మస్కట్‌లో తెలంగాణ కార్మికులను ఆదుకోండి: కేటీఆర్‌

June 06, 2020
img

గల్ఫ్ దేశాలలో లక్షలాదిమంది భారతీయ కార్మికులు, ఇంజనీర్లు తదితరులు పనిచేస్తున్నారు. అయితే ఆ దేశాలలో కూడా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమలుచేస్తుండటంతో వారు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారినందరినీ వెనక్కు తీసుకువచ్చేందుకు భారత్‌ ప్రభుత్వం ప్రత్యేక విమానాలు నడిపిస్తూనే ఉంది. అయితే వాటిలో అత్యధికంగా కేరళ రాష్ట్రానికే వెళుతున్నందున తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన కార్మికులు అష్టకష్టాలు పడుతూ తమను తీసుకువెళ్ళే విమానాల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. 

ఓమన్ రాజధాని మస్కట్‌లో పనిచేస్తున్న కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్ అనే కార్మికుడు ట్విట్టర్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తమ గోడు వెళ్ళబోసుకొని తమ కోసం విమానాలను పంపించవలసిందిగా అభ్యర్ధించాడు. లాక్‌డౌన్‌ కారణంగా 3 నెలల నుంచి తమకు పని, జీతాలు లేకపోవడంతో తామంతా తిండికి కూడా చాలా ఇబ్బందిపడుతున్నామని, కనుక వీలైనంత త్వరగా కేంద్రప్రభుత్వంతో మాట్లాడి మస్కట్‌కు విమానాలు పంపించి తమను ఆదుకోవాలని కార్మికులందరి తరపున విజ్ఞప్తి చేశాడు. 

దానిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌, పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్‌ పూరీకి వారి పరిస్థితి వివరించి, మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు విమానాలలో వారీనందరినీ రప్పించాలని కోరుతూ ట్వీట్ చేశారు.  


Related Post