అమెరికాలో ట్విట్టర్‌ బంద్?

May 29, 2020
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు, ట్విట్టర్‌ యాజమాన్యానికి చిన్నగా మొదలైన గొడవ ట్విట్టర్‌ను మూసివేసేంత వరకు వెళ్ళింది. అధ్యక్ష ఎన్నికలను ట్విట్టర్‌ ప్రభావితం చేసేవిధంగా వ్యవహరిస్తోందని, ‘ఫ్యాక్ట్ చెక్’ పేరిట ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని డోనాల్డ్ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా, ‘ఫ్యాక్ట్ చెక్’ ద్వారా ప్రజలు నిజానిజాలు నిర్ధారించుకోవదానికి సహకరించడంలో తప్పేమిటి? అంటూ ట్విట్టర్‌ సమర్ధించుకొంది. ఇది ట్రంప్‌కు మరింత ఆగ్రహం కలిగించింది. “ట్విట్టర్‌ను నియంత్రిస్తాం లేదా మూసేస్తాం. వాళ్ళు (ట్విట్టర్‌) మా గొంతు నోక్కేస్తున్నారు. వారిపై గట్టి చర్యలు తీసుకోబోతున్నాం. దాని కోసం ఎదురుచూడండి,” అంటూ ట్రంప్‌ ట్వీట్ చేశారు. 

ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాలలో ప్రచురించబడే వివాదాస్పదమైన ఆంశాలలో ఆ సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకోకుండా అమెరికా చట్టాలు రక్షణ కల్పిస్తున్నాయి. వాటికి ఆ రక్షణను తొలగించి, అవసరమైతే ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవడానికి లేదా నియంత్రించేందుకు అనుమతిస్తూ డోనాల్డ్ ట్రంప్‌ గురువారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. 

నాలుగేళ్ళ క్రితం ట్రంప్‌ మొదటిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసినప్పుడే ప్రజలకు చేరువయ్యేందుకు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాద్యమాలను విరివిగా ఉపయోగించుకొన్నారు. ఇప్పుడు కూడా ట్విట్టర్‌ యాజమాన్యానికి సమాధానం కూడా ట్విట్టర్‌లోనే ఇచ్చారు తప్ప నిరసనగా ట్విట్టర్‌లో తన ఖాతాను మూసివేసుకోలేదు. నేటికీ ట్విట్టర్‌ను వినియోగిస్తూనే దాని వలన సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పి ట్విట్టర్‌ను నియంత్రించేందుకు లేదా మూసివేసేందుకు డోనాల్డ్ ట్రంప్‌ సిద్దపడుతుండటం చాలా విడ్డూరంగా ఉంది. 

ఉత్తరకొరియా, చైనా వంటి నియంతృత్వ పాలన సాగుతున్న దేశాలలో ఇటువంటివి సర్వసాధారణం. కానీ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి మారుపేరుగా నిలుస్తున్న అమెరికాలో ఇది జరిగితే చాలా ఆశ్చర్యకరమే. దీనికి అమెరికన్లు, న్యాయస్థానాలు, కాంగ్రెస్‌ (పార్లమెంటు) అంగీకరిస్తాయనుకోలేము. అదే కనుక జరిగితే అప్పుడు నవ్వులపాలయ్యేది డోనాల్డ్ ట్రంపే.

Related Post