జ్యోతి కుమారికి ఇవాంక ట్రంప్‌ ప్రశంశలు

May 23, 2020
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సలహాదారుగా కూడా పనిచేస్తున్న ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్‌ బిహార్‌కు చెందిన జ్యోతి కుమారి అనే 15 ఏళ్ళ బాలికపై ప్రశంశల వర్షం కురిపించారు. ఆ బాలిక చేసిన సాహసం సామాన్యమైనదేమీ కాదు. హర్యానాలో గుర్గావ్‌ నుంచి 1,200 కిమీ దూరంలో గల బిహార్‌లోని దర్భాంగా జిల్లాలో ఆమె స్వగ్రామానికి సైకిల్‌పై చేరుకొంది. అది కూడా.. ఆమె ఒక్కర్తే రాలేదు. ఓ ప్రమాదంలో గాయపడిన తండ్రిని సైకిల్‌పై కూర్చొబెట్టుకొని ఏడు రోజులలో 1,200 కిమీ ప్రయాణించి స్వగ్రామం చేర్చింది. దారిలో కొందరు ట్రక్ డ్రైవర్లు దయతలచి కొంత దూరం వరకు తీసుకువచ్చారని జ్యోతి కుమారి చెప్పింది. ప్రస్తుతం వారిరువురూ క్వారెంటైన్‌ శిబిరంలో ఉన్నారు. 



ఈ వార్త ఇవాంక ట్రంప్‌ చెవిన కూడా పడటంతో ఆమె అబ్బురపడుతూ జ్యోతి కుమారిపై ప్రశంశల వర్షం కురిపించారు. “15 ఏళ్ళ జ్యోతి కుమారి, గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చొబెట్టుకొని ఏడు రోజులలో 1,200 కిమీ ప్రయాణించి తన స్వగ్రామం చేరుకొంది. ఇదొక అద్భుతం. భారతీయులలో ఉండే పట్టుదల, ప్రేమకు ఇది గొప్ప నిదర్శనం,” అని ట్వీట్ చేశారు.       

   

హర్యానాలో రిక్షా కార్మికుడిగా చేస్తున్న తండ్రితో కలిసి ఆమె ఉంటోంది. ఇటీవల తండ్రి ప్రమాదానికి గురయ్యారు. పైగా లాక్‌డౌన్‌ కారణంగా పని, ఆదాయం లేకపోవడంతో ఇంటి యజమాని బలవంతంగా వారి చేత ఇల్లు ఖాళీ చేయించి రోడ్డుపై పదేశాడు. దాంతో జ్యోతి కుమారి తండ్రికి నచ్చజెప్పి సైకిల్‌పై కూర్చొబెట్టుకొని 1,200 కిమీ ప్రయాణించి తన స్వగ్రామం చేరుకొంది. 

ఆమె చేసిన ఈ సాహసం సైకిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా వెళ్లడంతో జాతీయ పోటీలలో పాల్గొనేందుకు వీలుగా జ్యోతి కుమారికి ఉచిత శిక్షణ ఇస్తామని ఆహ్వానం పంపింది. 

జ్యోతి కుమారి చేసింది చాలా సాహసమే...చాలా అద్భుతమే! అయితే ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా లాక్‌డౌన్‌ ప్రకటించి దానిని నెలల తరబడి పొడిగిస్తూ పోవడంవలననే దేశంలో లక్షలాది నిరుపేద కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పక తప్పదు. నేటికీ వేలాదిమంది వలస కార్మికులు పసిపిల్లలను వెంటబెట్టుకొని తీవ్రమైన ఈ వేసవి ఎండల్లో నిప్పులు గ్రక్కుతున్న రోడ్లపై ముందుకు సాగిపోతూనే ఉన్నారు. వారిలో ఎందరు క్షేమంగా స్వగ్రామాలకు చేరుకొన్నారో... ఎందరు దారిలోనే రాలిపోయారో... ఎందరు కరోనాకు బలైపోయారో ఎవరికీ తెలీదు. వలస కార్మికుల తరలింపుకు వందలాది శ్రామిక్ రైళ్లు నడిపిస్తున్నప్పటికీ లక్షల సంఖ్యలో ఉన్నవారిని తరలించడానికి ఏమాత్రం సరిపోవడం లేదు. కనుక వారి కష్టాలు ఇప్పట్లో తీరకపోవచ్చు.

Related Post