అప్పులు తీర్చేస్తా..కేసులు మాఫీ చేయండి: మాల్యా

May 14, 2020
img

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా దేశంలో 14 బ్యాంకుల వద్ద రూ.9,000 కోట్లు అప్పులు చేసి తీర్చకుండా 2016లో  లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రోజుకో మాట చెపుతూ భారత్‌ తిరిగి రాకుండా తప్పించుకొని తిరుగుతున్న విజయ్ మాల్యా కేంద్రప్రభుత్వం నిన్న ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీని అభినందించే సాకుతో ట్విట్టర్‌ ద్వారా కేంద్రప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. “ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించినందుకు భారత ప్రభుత్వానికి అభినందనలు. ప్రభుత్వం తలుచుకొంటే ఎన్ని నోట్లైనా ముద్రించగలదు. కానీ నేను బ్యాంకులకు చెల్లించవలసిన రుణాలను 100 శాతం చెల్లిస్తానని పదేపదే చెపుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దయచేసి నా డబ్బు తీసుకొని బేషరతుగా నాపై మోపిన కేసులన్నిటినీ కొట్టివేయాలి,” అని ట్వీట్ చేశారు. 

  విజయ్ మాల్యా లండన్ పారిపోయిన కొత్తలో తాను అసలు ఎవరినీ మోసం చేయలేదని, లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానాల వలననే తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్నానని వాదించారు. భారత్‌ మీడియా తనను ఒక దేశద్రోహిగా, విలన్‌గా చిత్రీకరించడంతో దేశప్రజల దృష్టిలో తాను నేరస్తుడిననే అభిప్రాయం కలిగించాయని వాదించారు. బ్యాంకులు, ఈడీ, చివరికి సుప్రీంకోర్టు ఆదేశించినా భారత్‌కు తిరిగి రాకుండా లండన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. కానీ అన్ని దారులు మూసుకుపోవడంతో ఏదో ఒకరోజు లండన్ పోలీసులు అరెస్ట్ చేసి తనను భారత్‌కు అప్పగిస్తారని గ్రహించడంతో ఇప్పుడు ఈ కొత్త పాట పాడుతున్నారనుకోవచ్చు. 


తనను నమ్ముకొన్న కింగ్ ఫిషర్ ఉద్యోగులను రోడ్డున పడేసి, బ్యాంకులను మోసం చేసిలండన్ పారిపోయి, భారత ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును ధిక్కరించిన  విజయ్ మాల్యాను ప్రభుత్వం, కోర్టులు క్షమించగలవేమో కానీ దేశప్రజలు మాత్రం ఎన్నడూ క్షమించలేరు. ఎందుకంటే అతనివంటి వైట్ కాలర్ నేరగాళ్ళు బ్యాంకులను మోసం చేసి వేలకోట్లు ఎగవేస్తుంటే ఆ భారం సామాన్య ప్రజలపై మోపబడుతోంది. 

Related Post