వలసలపై నిషేదం 60 రోజులు మాత్రమే: ట్రంప్‌

April 22, 2020
img

కరోనా నేపధ్యంలో అమెరికా పౌరులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఇతరదేశాల నుంచి వచ్చేవారిపై తాత్కాలికంగా  నిషేదం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుండగా, ట్రంప్‌ మళ్ళీ దానిపై స్పష్టత నిచ్చారు.

“లాక్‌డౌన్‌ తరువాత ఉద్యోగాలలో అమెరికన్లకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశ్యంతోనే తాత్కాలికంగా నిషేదం విధించాము. అయితే ఈ నిషేధం కేవలం 60 రోజులు మాత్రమే అమలులో ఉంటుంది. ఆ తరువాత దేశ ఆర్ధికపరిస్థితులను బట్టి తగిన నిర్ణయం తీసుకొంటాము,” అని ట్రంప్‌ చెప్పారు.

అమెరికాలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటలలో అమెరికాలో కొత్తగా సుమారు 40,000 కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి కేసుల సంఖ్య 8,05,772కి చేరింది. గడచిన 24 గంటలలో 2,751 మంది చనిపోయారు. ఇప్పటి వరకు అమెరికాలో 40,316 మంది కరోనా బారినపడి చనిపోయారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పుడే ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు, లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చు. 

కనుక మరొక నెలరోజులైనా అమెరికాలో లాక్‌డౌన్‌ పొడిగించక తప్పదు. ఆలోగా కరోనాకు వ్యాక్సిన్ లేదా మందులు కనుగొన్నట్లయితే లాక్‌డౌన్‌ ఎత్తివేసే సాహసం చేయవచ్చు. లేకుంటే కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఉండవలసిందే. ఒకవేళ రాబోయే రెండు నెలలలోగా కరోనాను కట్టడి చేయగలిగితే అమెరికా మళ్ళీ కోలుకోవడానికి కనీసం 8-12 నెలలు సమయం పట్టవచ్చని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనుక అమెరికా మళ్ళీ ఆర్ధికంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు..అమెరికన్లకు నిరుద్యోగభృతి చెల్లిస్తూ ఇతరదేశాలవారికి డోనాల్డ్ ట్రంప్‌ అమెరికాలో ఉద్యోగావకాశాలు కల్పిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. కనుక అమెరికా పూర్తిగా కోలుకొనేవరకు అంటే బహుశః ఈ ఏడాది డిసెంబరు వరకు వలసలపై నిషేదం పొడిగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆ తరువాత కూడా చాలా పరిమితంగానే హెచ్-1బీ వీసాలు మంజూరు చేయవచ్చు. అమెరికాతో సహా అగ్రదేశాలన్నీ కరోనాతో ఆర్ధికంగా చితికిపోతున్నాయి కనుక అమెరికా లేదా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న భారతీయ యువత దేశంలో ఉద్యోగ, ఉపాది అవకాశాలు చూసుకోవడం చాలా మంచిది.

Related Post