అమెరికాలో ఒక్కరోజునే 4,491 మంది మృతి

April 17, 2020
img

కరోనా వైరస్‌ను మొదట్లో తక్కువగా అంచనావేసి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అమెరికా ఇప్పుడు చాలా భారీ మూల్యం చెల్లిస్తోంది. అమెరికా చరిత్రలో నిన్న ఒక అత్యంత భయంకరమైన రోజుగా చెప్పవచ్చు. ఎందుకంటే గడిచిన 24 గంటలలో అమెరికాలో 4,491 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇది ఇక్కడితోనే ఆగుతుందా ఇంకా పెరిగిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో హటాత్తుగా కరోనా కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. కరోనా కేసులు, మృతుల సంఖ్య లెక్కింపులో అమెరికా అనుసరిస్తున్న నూతన విధానమే అందుకు కారణంగా కనిపిస్తోంది.   

అమెరికాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులనే కరోనా కేసులుగా లెక్కిస్తున్నారు. కానీ గురువారం నుంచి కరోనా లక్షణాలున్నవారిని కూడా కలిపి లెక్కిస్తుండటంతో బుదవారం 5.59 లక్షల కేసులు నమోదు కాగా గురువారం నాటికి ఒకేసారి 82,510 కేసులు పెరిగి కరోనా కేసుల సంఖ్య 6,41,919కి చేరింది. అలాగే కరోనా అనుమానిత లక్షణాలతో  మృతి చెందినవారిని కూడా కరోనాతో చనిపోయినట్లుగా పరిగణిస్తుండటంతో అమెరికాలో కరోనా మృతుల సంఖ్య భారీగా పెరిగి 34,562కి చేరింది. 

అమెరికాకు ఈ దుస్థితికి కారణమైన చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “ఈ కరోనా వైరస్‌ యాదృచ్ఛికంగా పుట్టిందా లేక సృష్టించబడిందా?అనే అనుమానాలు మాకున్నాయి. దీనిపై మా ఇంటలిజన్స్ శాఖ దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గు తెలుస్తుంది,” అని అన్నారు. 

డొనాల్డ్ ట్రంప్‌, మైక్ పాంపియో సూటిగా చెప్పనప్పటికీ, ప్రపంచదేశాలలో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బ తీసేందుకే చైనా ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కరోనా వైరస్‌ను ఒక జీవాయుధంగా సృష్టించి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నట్లు కనబడుతోంది. కనుక ఈ కరోనా సంక్షోభం నుంచి అమెరికా పూర్తిగా బయటపడి డొనాల్డ్ ట్రంప్‌ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే, అమెరికాకు ఈ దుస్థితి కల్పించిన చైనాపై ఆయన తప్పకుండా ప్రతీకార చర్యలు తీసుకొనే అవకాశాలున్నాయి. బహుశః అందుకే కరోనా వైరస్‌ ఏవిధంగా పుట్టిందనే దానిపై దర్యాప్తుకు సిద్దం అవుతున్నట్లు భావించవచ్చు. 

Related Post