ఇటలీ, అమెరికా, స్పెయిన్‌లో ఆగని మృత్యుఘోష

April 09, 2020
img

ఇటలీ, అమెరికా, స్పెయిన్‌ మూడు దేశాలలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో రోజూ వేలాదిమంది మరణిస్తున్నారు. ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారికి అన్నిటికంటే ఇటలీ ఎక్కువగా బలవుతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 1,39,422 కేసులు నమోదు కాగా 17,669 మంది చనిపోయారు. 

అమెరికా (4,34,791)తో పోలిస్తే ఇటలీ (1,39,422) స్పెయిన్ (1,48, 220) దేశాలలో కరోనా కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ చనిపోతున్నవారి సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంది. బుదవారం ఒక్కరోజే స్పెయిన్ దేశంలో 757 మంది చనిపోయారు. స్పెయిన్‌లో ఇప్పటివరకు 14,792 మంది చనిపోయారు. 

అమెరికాలో మంగళవారం 1,939మంది, బుదవారం 1,973 మంది మరణించారు. అమెరికాలో ఇప్పటివరకు 14,800 మంది కరోనాకు బలయ్యారు. ఇప్పటివరకు 4,34,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

అమెరికాలో  ప్రధానంగా న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్క న్యూయార్క్‌లోనే 1,49,316 కేసులు నమోదు కాగా 6,268 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. తెలుగువారు ఎక్కువగా నివాసం ఉండే న్యూజెర్సీలో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. అక్కడ 47,437 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 1,504 మంది మృతి చెందారు. చనిపోయినవారిలో 11 మంది ప్రవాసభారతీయులు కూడా ఉన్నారు. 

మిచిగాన్ రాష్ట్రంలో 959 మంది, లూసియానాలో 652, ఇల్లినాయిస్‌లో 462, కాలిఫోర్నియాలో 442, వాషింగ్‌టన్‌లో 421,  పెన్‌సలవేనియాలో 309, ఫ్లోరిడాలో 323 మంది చనిపోయారు.    

అమెరికాలో నార్తర్న్ మరినా ఐలాండ్స్ లో కరోనా ప్రభావం చాలాతక్కువగా ఉంది. అక్కడ ఇప్పటివరకు కేవలం 8 పాజిటివ్ కేసులే నమోదుకాగా వారిలో ఒకరు చనిపోయారు. అమెరికాలో కరోనా లేని ఒకే ఒక రాష్ట్రం అమెరికన్ సమోవా. అక్కడ ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కనుక మరణాలు కూడా లేవు. 

Related Post