పాకిస్థాన్‌లో వైద్యులపై లాఠీఛార్జ్...అరెస్ట్!

April 07, 2020
img

ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని కాపాడగలిగేవారు ఇద్దరే ఉన్నారు. ఒకరు భగవంతుడు...మరొకరు వైద్యుడు. ప్రస్తుతం భగవంతుడు కూడా విశ్రాంతి తీసుకొంటున్నందున ఆయన ప్రతిరూపంగా భావింపబడే వైద్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. కనుక యావత్ ప్రపంచదేశాలు వైద్యులకు, వైద్యసిబ్బందికి నీరాజనాలు పలుకుతుంటే పాకిస్థాన్‌లో మాత్రం కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న 53 మంది వైద్యులు, సిబ్బందిపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడమే కాక కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు కూడా! 

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో క్వెట్టా పట్టణంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు పీపీఈ కిట్లు లేకపోవడంతో తమ ప్రాణాలకు, రోగుల ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా వారు వాడినవాటినే మళ్ళీ మళ్ళీ వాడవలసివస్తోంది. కనుక వీలైనంత త్వరగా తమకు పీపీఈ కిట్లు ఏర్పాటు చేయవలసిందిగా గత రెండువారాలుగా కోరుతున్నారు. కానీ ఇంతవరకు వాటిని ఏర్పాటుచేయకపోవడంతో, సోమవారం ఉదయం క్వెట్టా ప్రభుతాసుపత్రిలో పనిచేస్తున్న 53 మంది వైద్యులు, సిబ్బంది ఆసుపత్రి బయట ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలనుకున్నారు. 

కానీ వారు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ధర్నా చేసినందుకు పోలీసులు వారిపై లాఠీ ఛార్జీ చేసి కేసులు నమోదు చేశారని క్వెట్టా పట్టణ ఎస్పీ అబ్దుల్‌ రజాక్‌ దృవీకరించారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న తమ పట్ల పోలీసులు, ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరించడాన్ని  క్వెట్టా పట్టణ వైద్య సమాఖ్య అధ్యక్షుడు యాసీర్‌ తీవ్రంగా ఖండించారు. కరోనా మహమ్మారిపై ప్రత్యక్షంగా పోరాడుతున్న వైద్యులను, వైద్యసిబ్బందికి అండగా నిలబడి వారికి అవసరమైన పరికరాలు సమకూర్చకపోగా వారిపై లాఠీ ఛార్జీ చేయడాన్ని పాకిస్తాన్ ప్రజలు కూడా తప్పు పడుతున్నారు.

Related Post