పాకిస్థాన్‌లో కరోనా ప్రభావం ఎలా ఉందంటే...

March 21, 2020
img

మన పొరుగుదేశమైన పాకిస్థాన్‌ గురించి ప్రస్తావించవలసి వచ్చినప్పుడు సాధారణంగా రెండే విషయాలు ఎక్కువగా వినబడుతుంటాయి. 1 క్రికెట్. 2 టెర్రరిస్టులు. కానీ కరోనా వైరస్‌ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఇప్పుడు పాకిస్థాన్‌లో ఆ రెంటి ఊసే వినబడటంలేదు. పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు మొత్తం 510 కరోనా కేసులు నమోదు కాగా, ముగ్గురు మాత్రమే మరణించినట్లు సమాచారం. పాకిస్థాన్‌లో అత్యధికంగా సింధ్ ప్రావిన్స్ లో 267 మండి, పంజాబ్‌లో 96, బలూచిస్తాన్‌లో 92, అత్యల్పంగా ఇస్లామాబాద్‌లో 10 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

అన్ని దేశాలలాగే పాకిస్థాన్‌ నుంచి విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దాంతో ఎగుమతులపైనే ఆధారపడిన పాకిస్థాన్‌ వస్త్ర పరిశ్రమతో సహా పలు పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకొన్నాయి. ఆ కారణంగా వాటిలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం పొంచి ఉంది. దేశీయంగా వినియోగమయ్యే ఉత్పత్తులపై కూడా కరోనా వైరస్‌ ప్రభావం పడుతుండటంతో ఆయా రంగాలు నష్టపోతున్నాయి. ప్రపంచదేశాలందించే ఆర్ధికసాయంతో భారంగా సాగుతున్న పాకిస్థాన్‌ ఇప్పుడు ఈ కరోనాను...దాని పర్యవసనాలను తట్టుకొని నిలబడగలదా లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పాకిస్థాన్‌ ప్రభుత్వం కరోనాను కట్టడిచేయడంలో విఫలమైతే ఇప్పటి వరకు ఉగ్రవాదులకు నిలయంగా ఆ దేశం కరోనా రోగులకు నిలయంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. పాకిస్థాన్‌లో కరోనా అంటే మన పొరుగింటికి మంటలు అంటుకొన్నట్లే కనుక ఆ ప్రభావం భారత్‌పై కూడా పడే ప్రమాదం ఉంటుంది. ఇప్పటివరకు ఆ దేశంలో శిక్షణ పొందుతున్న ఉగ్రవాదుల వలన బాధలు పడుతున్న భారత్‌, ఇప్పుడు పాకిస్థాన్‌ నుంచి కరోనా వైరస్‌ వ్యాపిస్తే దాంతో కొత్త సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. 


Related Post