వైట్ హౌసులోకి కరోనా ఎంట్రీ!

March 21, 2020
img

అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌసులోకి కూడా కరోనా వైరస్ ప్రవేశించడంతో ఒక్కసారిగా అందరూ అప్రమత్తమయ్యారు. విశేషమేమిటంటే, దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితులను సమీక్షిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలో సభ్యుడుగా ఉన్న అధికారికే కరోనా వైరస్‌ సోకింది. వైట్ హౌసులోకి కరోనా ప్రవేశించడంతో వైట్ హౌస్ అధికారులందరూ అప్రమత్తమయ్యారు. వైట్ హౌసును పూర్తిగా దిగ్బంధనం చేసి, లోపలకు ప్రవేశిస్తున్నవారినందరినీ పరీక్షించిన తరువాతే అనుమతిస్తున్నారు. వైట్ హౌసులో ఉన్నతాధికారికి కరోనా సోకడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, కుటుంబ సభ్యులు అందరూ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. 

అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 18,000 కరోనా కేసులు నమోదుకాగా 230 మంది మరణించారు. శుక్రవారం ఒక్కరోజే అమెరికాలో కొత్తగా 10,000 కరోనా లక్షణాలున్న కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వారిలో ఎంతమందికి కరోనా పాజిటివ్ ఉందో ఇంకా తెలియవలసి ఉంది. అమెరికాలో వాషింగ్టన్‌లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు కాగా 74 మంది చనిపోయినట్లు సమాచారం. న్యూయార్క్, కాలిఫోర్నియాలలో కూడా కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో అత్యవసర పరిస్థితులు ప్రకటించి కరోనా వైరస్‌ కట్టడికి అమెరికా ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. 

Related Post