అమెరికాలో వధూవరులు...వనపర్తిలో నిశ్చితార్ధం

February 28, 2020
img

అందివచ్చిన టెక్నాలజీని ఏవిధంగా సద్వియోగించుకోవచ్చో తెలియజేసే కార్యక్రమం వనపర్తి జిల్లా మదనాపురంలో జరిగింది. 

మాధనాపుర వాస్తవ్యులైన జక్కుల నాగన్న,అనురాధ దంపతుల కుమార్తె సావ్వీ శృతి గత ఏడేళ్లుగా అమెరికాలో న్యూజెర్సీలోని ఓ ఐ‌టి కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తోంది. అమెరికాలో ఉన్న ఆమెకు పెళ్లి చేయాలని తల్లితండ్రులు ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడ ఉద్యోగాలు చేస్తున్న యువతీయువకులందరికీ ఎదురయ్యే సమస్యే ఆమెకు కూడా ఎదురైంది. పెళ్లి చూపుల కోసం ఇండియాకు వచ్చిపోవడం కష్టంగా మారింది. 

న్యూజెర్సీలోనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న వంశీకృష్ణకు కూడా ఇంచుమించు ఇటువంటి సమస్యే ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే అతని స్వస్థలం వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండ. 

ఇటీవల వారిరువురి తల్లితండ్రులు అమెరికాలో పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు అనుకోకుండా కలిశారు. అప్పుడే వారిమద్య శృతి, వంశీకృష్ణల పెళ్లి మాటలు జరిగాయి. వారిరువురు కూడా ఒకరికొకరు నచ్చడంతో అక్కడే వివాహం ఖాయం చేసుకొని వారి తల్లితండ్రులు ఇండియా తిరిగి వచ్చేశారు. కానీ నిశ్చితార్ధ కార్యక్రమానికి హాజరుకావడానికి శృతి, వంశీకృష్ణలకు శలవు దొరకలేదు. దాంతో వారిరువురి తల్లితండ్రులు టెక్నాలజీని ఉపయోగించుకొని పద్దతి ప్రకారం నిశ్చయతాంబూలాల కార్యక్రమం కానిచ్చేశారు. 


గురువారం మధ్యాహ్నం పెద్దలు నిశ్చయించిన మూహూర్తానికి ఇక్కడ మదనాపురంలో గల ఆంజనేయస్వామి ఆలయంలో గురుస్వామి గోపాలకృష్ణ వేదమంత్రాలు చదువుతుంటే, ఆయన సూచనల ప్రకారం అక్కడ అమెరికాలో కంప్యూటర్ స్క్రీన్ ముందు వారిరువురూ మిత్రుల సమక్షంలో రింగులు మార్చుకొన్నారు. ఇక్కడ మదనాపురం ఆలయంలో ఉన్న ఇరుకుటుంబాల పెద్దలు, బందుమిత్రులు అందరూ ఎల్ఈడీ స్క్రీన్ మీద వారిరువురినీ చూస్తూ, ఇక్కడి నుంచే వారిరువురినీ ఆశీర్వదించారు. 

Related Post