ట్రంప్‌ దంపతులు అమెరికా తిరుగు ప్రయాణం

February 26, 2020
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కుటుంబసభ్యులు రెండు రోజుల భారత్‌ పర్యటన ముగించుకొని మంగళవారం రాత్రి 10.40 గంటలకు ఎయిర్ ఫోర్స్-1 ప్రత్యేకవిమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణం అయ్యారు.

మంగళవారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, ఆమె భర్త కుష్నర్ తదితరులు విందుకు హాజరయ్యి భారతీయ వంటకాలను ఆస్వాదించారు. ఈ విందు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్రమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విందుకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ డొనాల్డ్ ట్రంప్‌కు శాలువాకప్పి సన్మానించారు. ట్రంప్ దంపతుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన చార్మినార్ బొమ్మను బహుకరించారు. సిఎం కేసీఆర్‌ మెలానియా, ఇవాంకాలకు పట్టు చీరలు బహుకరించారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో జీఈఎస్ సదస్సు అద్భుతంగా నిర్వహించారని ట్రంప్ సిఎం కేసీఆర్‌ను మెచ్చుకున్నారు. ఆ సదస్సుకు తాను కూడా రావాలనుకున్నానని కానీ పనుల ఒత్తిడి వలన రాలేకపోయానని చెప్పినట్లు తెలుస్తోంది. 

విందు అనంతరం ట్రంప్ కుటుంబ సభ్యులు, అధికారులు కారులో నేరుగా డిల్లీ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి అమెరికాకు తిరుగు ప్రయాణం అయ్యారు. 

Related Post