ప్రవాసభారతీయులకు ట్రంప్ సర్కార్ షాక్

February 24, 2020
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరికొద్ది సేపటిలో భారత్‌ చేరుకొనున్నారు. నవంబరులో జరుగబోయే అధ్యక్ష ఎన్నికలలో మళ్ళీ పోటీ చేస్తున్న ట్రంప్, భారత్‌ పర్యటనతో అమెరికాలో స్థిరపడిన ప్రవాసభారతీయులను ఆకట్టుకోవాలని ఆశించడం సహజమే. కానీ ఆయన భారత్‌లో అడుగుపెడుతున్న రోజే అమెరికా ప్రభుత్వం అక్కడ స్థిరపడిన ప్రవాసభారతీయులకు, హెచ్-1బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేసుకొంటూ గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది విదేశీయులకు పెద్ద షాక్ ఇచ్చింది. 

అమెరికన్ ప్రభుత్వం కూడా తమ దేశంలో పేదప్రజల కోసం సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది. అమెరికన్ పేద ప్రజల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను దేశంలో స్థిరపడిన, స్థిరపడాలని ఎదురుచూస్తున్నవారు కూడా వినియోగించుకొంటుండటం వలన ప్రభుత్వం ఆర్ధికభారం పడుతోందని భావించిన ట్రంప్ సర్కార్, అమెరికాలోని విదేశీయులు ఎవరూ వాటిని వినియోగించుకోరాదని, ఆవిధంగా వినియోగించుకొన్నవారికి, వీసా గడువు పొడిగించకూడదని, గ్రీన్ కార్డులకు అనర్హులుగా పరిగణించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ఈ ఆంక్షలను గత ఏడాది ఆగస్టులోనే అమలుచేయాలనుకొన్నప్పటికీ న్యాయవివాదాల కారణంగా ఇంతకాలం అమలుచేయలేకపోయింది. కానీ వీటి అమలుకున్న అవరోధలన్నిటినీ అమెరికా సుప్రీంకోర్టు తొలగించడంతో ట్రంప్ భారత్‌లో కాలుపెట్టిన రోజునుంచే అమలులోకి రానున్నాయి. 

అమెరికాలో కాలుపెడితే చాలు...కోట్లు సంపాదించుకొని విలాసవంతమైన జీవితం గడపవచ్చని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ దక్షిణాసియా దేశాల నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడినవారిలో 4.72 లక్షల మంది దుర్భర దారిద్యంలో మగ్గుతున్నారని అమెరికా గణాంకాలే చెపుతున్నాయి. వారందరూ అమెరికా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపధకాల వలన లబ్దిపొందుతున్నారు. వారిలో 11 శాతం మంది నాన్ సిటిజన్ ఇండియన్స్ కూడా ఉన్నారు. 

అమెరికా ప్రభుత్వ కోణంలో నుంచి చూసినట్లయితే ఇది సరైన నిర్ణయమే. తప్పు పట్టడానికి లేదు. కానీ అమెరికాలో స్థిరపడిన విదేశీయులు కూడా పన్నులు, ఫీజుల రూపేణా అమెరికన్లతో సమానంగా లేదా ఇంకా కాస్త ఎక్కువగానే చెల్లిస్తున్నప్పుడు వారు సంక్షేమపధకాలు వినియోగించుకోకూడదని ఆంక్షలు విధించడాన్ని అందరూ తప్పు పడుతున్నారు.

ఒకపక్క ఇటువంటి ఆంక్షలు విధిస్తూ భారత్‌ పర్యటనతో అమెరికాలో స్థిరపడిన ప్రవాసభారతీయులను ఆకట్టుకోవాలని ట్రంప్ ఆశించడం అత్యాశే అవుతుంది. 

Related Post