కూతురు, అల్లుడు కూడా వస్తున్నారుట!

February 21, 2020
img

ఈనెల 24,25 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఆయన భార్య మెలానియా ట్రంప్ భారత్‌లో పర్యటించడానికి వస్తున్న సంగతి తెలిసిందే. వారితోపాటు వారి కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెద్ కుష్నర్ కూడా వస్తున్నట్లు అమెరికా అధికారవర్గాలు ప్రకటించాయి. అయితే ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెద్ కుష్నర్ ఇద్దరూ కూతురు అల్లుడు హోదాలో కాక డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సలహాదారుల హోదాలో ఈ పర్యటనలో పాల్గొనున్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రెయిన్‌తో సహ అనేకమంది ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొనున్నారు. వారందరూ ట్రంప్ దంపతులతో కలిసి అహ్మదాబాద్‌కు వెళ్ళి అక్కడి నుంచి ఆగ్రాలో తాజ్ మహల్ చూసిన తరువాత డిల్లీ చేరుకొంటారు. ఫిబ్రవరి 25 రాత్రి డిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నివాసంలో విందుభోజనం చేసిన తిరిగి అందరూ అమెరికా తిరుగు ప్రయాణం అవుతారు.  

సాధారణంగా పల్లెలో ఏ ఇంటికి కొత్తఅల్లుడు వచ్చినా అతనిని ఊళ్ళో అందరికీ అల్లుడే అన్నట్లు ప్రేమగా, అభిమానంగా  పలకరిస్తుంటారు. కనుక ట్రంప్ కోసమే ఇంత హడావుడిపడిపోతున్న మన కేంద్రప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, అహ్మదాబాద్‌ మునిసిపల్ అధికారులు ట్రంప్ కూతురు, అల్లుడుని కూడా ప్రసన్నం చేసుకోవడానికి ఇంకా హైరానాపడతారేమో?

Related Post