డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన వివరాలు

February 20, 2020
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మేలానియా ట్రంప్ దంపతులు ఈనెల 24,25 తేదీలలో భారత్‌లో పర్యటించనున్నారు. వారు 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొంటారు. అక్కడ వారికి ప్రధాని నరేంద్రమోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌, పలువురు కేంద్రమంత్రులు ఆయనకు స్వాగతం పలుకుతారు.  

అనంతరం ప్రధాని నరేంద్రమోడీ, డొనాల్డ్ ట్రంప్ కలిసి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన్న సబర్మతి ఆశ్రమం చేరుకొంటారు. సుమారు 22 కిమీ పొడవునా రోడ్డుకిరువైపులా 70 లక్షల మంది ప్రజలు డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు 20 నిమిషాలుంటారు.    

అనంతరం డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోడీ కలిసి మధ్యాహ్నం 1.15 గంటలకు మోతేరాలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు చేరుకొని దానిని ప్రారంభిస్తారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్దదిగా నిర్మించబడిన ఆ స్టేడియంలో 1.10 లక్షలమందితో ‘నమస్తే ట్రంప్’ పేరుతో జరుగబోయే స్వాగత కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తారు. 

అనంతరం ట్రంప్ దంపతులు మధ్యాహ్నం 3.30 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరి 4.30 గంటలకు ఆగ్రా చేరుకొంటారు. అక్కడ వారికి యూపీ సిఎం యోగీ ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్‌ తదితరులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వారిరువురూ తాజ్ మహల్ చేరుకొంటారు. సాయంత్రం 5.30 గంటల వరకు వారిరువురూ తాజ్ మహల్ వద్ద గడుపుతారు. అక్కడి నుంచి మళ్ళీ విమానంలో డిల్లీ చేరుకొంటారు. రాత్రి 7-7.30 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో విందు భోజనం చేస్తారు.     

మరుసటిరోజు ఉదయం 9 గంటలకు రాష్ట్రపతి భవన్ వద్ద నిర్వహించే గౌరవవందన కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రధాని నరేంద్రమోడీతో కలిసి రాజ్‌ఘాట్ చేరుకొని జాతిపిత మహాత్మాగాంధీజీకి నివాళులర్పిస్తారు. 

ఆ తరువాత డిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్-నరేంద్రమోడీ అధికారుల బృందాలు సమావేశమయ్యి ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. భోజనవిరామం అనంతరం డొనాల్డ్ ట్రంప్ డిల్లీలోని హోటల్ తాజ్‌ చేరుకొని అక్కడ  పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో జరిగే బిజినెస్ మీటింగులో పాల్గొంటారు. 

ఆ తరువాత ట్రంప్ దంపతులు రాష్ట్రపతి భవన్ చేరుకొంటారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారి గౌరవార్ధం ఇచ్చే విందులో పాల్గొంటారు. భోజనాంతరం రాత్రి 10 గంటలకు మళ్ళీ తమ ఎయిర్ ఫోర్స్ 1 ప్రత్యేక విమానంలో అమెరికా తిరుగు ప్రయాణం అవుతారు.

Related Post