ట్రంప్ దంపతులకు 70 లక్షలమందితో ఆహ్వానం...అవసరమా?

February 13, 2020
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 24,25 తేదీలలో భారత్‌ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంను డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించబోతున్నారు. లక్షమంది పట్టే విధంగా నిర్మించిన ఆ స్టేడియం ప్రపంచంలోకెల్లా అతిపెద్దదిగా నిలువబోతోంది. దానిలో ట్రంప్ లక్షమందిని ఉద్దేశ్యించి ప్రసంగించబోతున్నారు. గత ఏడాది ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్ నగరంలో ‘హౌడీ మోడీ’ పేరుతో సుమారు 40-50,000 మంది ప్రవాసభారతీయులతో చాలా అట్టహాసంగా సభ జరిగింది. దానిలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ మోడీకున్న ప్రజాధారణను చూసి ఆశ్చర్యపోయారు. 'కెమ్ చో ట్రంప్?' (హౌ ఆర్యూ ట్రంప్?) పేరుతో ఆ స్టేడియంలో నిర్వహించబోయే స్వాగతసభలో డొనాల్డ్ ట్రంప్ ఏకంగా లక్షమందిని చూడబోతున్నారు.

అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్ దంపతులకు అహ్మదాబాద్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో ఘన స్వాగతం పలకాలని ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు రోడ్డుకిరువైపులా సుమారు 70-80 లక్షల మందితో స్వాగతం పలికించడానికి జనసమీకరణ చేయబోతున్నట్లు తాజా సమాచారం.

అలాగే డొనాల్డ్ ట్రంప్ దంపతులు అమెరికా నుంచి బయలుదేరినప్పటి నుంచి భారత్‌లో దిగేవరకు వారికి స్వాగతం పలుకుతూ సోషల్ మీడియా ద్వారా లక్షలమందితో మెసేజులు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక డొనాల్డ్ ట్రంప్ దంపతులను స్వాగతించేందుకు అహ్మదాబాద్‌ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేంకు గుజరాత్ ప్రభుత్వం కోట్లు రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ ఏర్పాట్లతో తీరిక లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను కూడా వాయిదా వేసింది. 

అమెరికాతో స్నేహసంబంధాలు బలపరుచుకోవడం చాలా అవసరమే కనుక డొనాల్డ్ ట్రంప్ దంపతులను సకలమర్యాదల ఆహ్వానించడం సమంజసమే. కానీ వారి మెప్పు కోసం 70-80 లక్షలమందిని జనసమీకరణ చేయాలనుకోవడం నిజమైతే అది చాలా హాస్యాస్పద విషయమే అవుతుంది. అంతమందిని సమీకరించడం సాధ్యమా కాదా? దానికోసం ఎంత ప్రజాధనం ఖర్చవుతుంది? అంత ఖర్చు చేసినా...అన్నీ లక్షల మందిని శ్రమపెట్టినా డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు లబ్ది కల్గించేందుకు అమెరికా ప్రయోజనాలను పణంగా పెడతారనుకోలేము.

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాలలో నెలకొన్న వివాదాలపై ట్రంప్ స్పందిస్తూ ‘రైట్ డీల్ ఆర్‌ నో డీల్’ అని ముందే చెప్పడం గమనిస్తే ఆయన వైఖరి మారదని స్పష్టం అవుతోంది. కనుక ఆయనకు ఎంత అట్టహాసంగా స్వాగతం పలికినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈ పర్యటన ద్వారా అమెరికాలోని ప్రవాస భారతీయులను ఆకట్టుకొని నవంబరులో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో లబ్ది పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే డొనాల్డ్ ట్రంప్ తాను పక్క వ్యాపారినని మరోసారి నిరూపించుకోబోతున్నారని అర్ధమవుతోంది. 

Related Post