పొరపాటున కూల్చేశాము..క్షమించండి: ఇరాన్‌

January 11, 2020
img

ఎట్టకేలకు ఇరాన్‌ ప్రభుత్వం తన ఘోరతప్పిదాన్ని ఒప్పుకొని క్షమాపనలు చెప్పింది. గత బుదవారం ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమానం (పిఎస్-752) టెహ్రాన్‌లోని ఖొమైనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని బోరిస్పల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్దిసేపటికే టెహ్రాన్‌కు నైరుతి వైపు గల పరాండ్‌ వద్ద కూలిపోయింది. విమాన సిబ్బందితో సహా మొత్తం 178 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. 

మొదట సాంకేతిక సమస్య కారణంగా విమానం కూలిపోయినట్లు ఇరాన్‌ చెప్పినప్పటికీ, ఇరాన్‌ భూభాగం నుంచి ప్రయోగించిన రెండు క్షిపణుల దాడితో ఆ విమానం కూలిపోయినట్లు కెనడా ప్రభుత్వం వీడియా ఆధారాలు బయట పెట్టి సంజాయిషీ కోరడంతో ఇరాన్‌ ప్రభుత్వం తన ఘోర తప్పిదాన్ని ఒప్పుకొని ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికుల కుటుంబ సభ్యులందరికీ క్షమాపణలు చెప్పింది. 

ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్ జారీఫ్ ఈ ఘటనపై ప్రభుత్వం తరపున స్పందిస్తూ, “అది చాలా దురదృష్టకరమైన రోజు. అమెరికా వలన తలెత్తిన యుద్ధవాతావరణంలో మానవ తప్పిదం కారణంగా మా వలన ఆ పొరపాటు జరిగింది. మా రక్షణశాఖ అంతర్గత దర్యాప్తుతో ఈవిషయం గుర్తించాము. జరిగిన ఈ పొరపాటుకు చాలా చింతిస్తున్నాం. పశ్చాత్తాపపడుతున్నాం. విమాన ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు క్షమాపణలు చెపుతున్నాం,” అని ట్విట్టర్‌లో సందేశం పెట్టారు. 

Related Post