ఇరాన్‌లో ఘోరవిమానప్రమాదం.. 169 మంది మృతి

January 08, 2020
img

ఇరాన్‌-అమెరికా దేశాల మద్య యుద్ధమేఘాలు కమ్ముకొన్న ఈ సమయంలోనే ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఘోరవిమానప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది విమాన సిబ్బందితో సహా మొత్తం 169మంది మృతి చెందారు. 

తాజా సమాచారం ప్రకారం స్థానిక కాలమాన ప్రకారం బుదవారం ఉదయం సుమారు 7.30-8.30 గంటల మద్య ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమానం (పిఎస్-752) టెహ్రాన్‌లోని ఖొమైనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని బోరిస్పల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్దిసేపటికే టెహ్రాన్‌కు నైరుతి వైపు గల పరాండ్‌ వద్ద కూలిపోయింది.

ప్రమాదసమాచారం అండగానే సహాయ, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొన్నారు. అయితే అప్పటికే విమానం ముక్కలు చెల్లాచెదురుగాపడి పూర్తిగా కాలిబూడిదైపోయాయి. కనుక విమానంలో ఉన్న అందరూ ఈ ప్రమాదంలో మృతి చెందినట్లేనని తెలుస్తోంది.    


సాంకేతిక సమస్య వలననే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని వైమానికశాఖ అధికారులు చెపుతుంటే, అమెరికాయే ఆ పౌరవిమానాన్ని కూల్చివేసిందని ఇరాన్‌ మిలటరీ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ విమానంపై తాము దాడి చేయలేదని అమెరికా స్పష్టం చేసింది. 

మంగళవారం సాయంత్రం ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేయడం, మరుసటిరోజునే ఈ ఘోర విమానప్రమాదం జరుగడంతో ఇరుదేశాల మద్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకొన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఇరాన్‌లోని బుషెహర్ అణుకేంద్రం వద్ద బుదవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు అయినట్లు గుర్తించారు. అయితే దీని వలన అణుకేంద్రానికి ఎటువంటి ప్రమాదమూ సంభవించలేదు.

Related Post