అమెరికాపై ప్రతీకారానికి ఇరాన్ సిద్దం?

January 06, 2020
img

అమెరికా-ఇరాన్ దేశాలు ప్రత్యక్షయుద్దం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రజలు అమితంగా అభిమానించే జనరల్ ఖాసీం సులేమానితో సహా మరో 8మంది ముఖ్య నేతలను అమెరికా దళాలు బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బయట దాడి చేసి హతమార్చడంతో ఇరాన్, ఇరాక్ ప్రభుత్వాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆ దాడి జరిగిన తరువాత ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్ దాడులు జరిగాయి. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, “సులేమానీ ఒక ఉగ్రవాది. అతనిని హతమార్చినందుకు ఇరాన్ మాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మేము చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోము. ఇరాన్‌లో రాజకీయంగా, సైనికంగా, సాంస్కృతికంగా ప్రాధాన్యమున్న 52 లక్ష్యాలను గుర్తించాము. ఒకవేళ ఇరాన్ ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా వెంటనే మేము చాలా చురుకుగా, తీవ్రస్థాయిలో వాటిపై దాడులు చేస్తాము. అమెరికా సైన్య, ఆయుధ సంపత్తి గురించి తెలిసికూడా ఇరాన్ ప్రతీకారచర్యకు పూనుకొంటే ఇరాన్ వినాశనం తప్పదు,” అని హెచ్చరించారు. 

అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ఇరాన్, ఇరాక్ దేశాలు ఏమాత్రం భయపడలేదు పైగా తీవ్ర నిర్ణయాలు తీసుకొన్నాయి. ఇరాన్‌లోని ఖోమ్ పట్టణంలో పురాతన జంకారా మసీదుపై మళ్ళీ 1350 సంవత్సరాల తరువాత ఎర్రరంగు జెండాను ఎగురవేశారు. షియా ముస్లింల సాంప్రదాయం ప్రకారం ఎర్రజెండా ఎగురవేయడం యుద్ధానికి, ప్రతీకారానికి సంకేతం. అమెరికాపై అణుదాడి చేయాలని ఇరాన్ భావిస్తున్నట్లు సమాచారం. 

ఇక ఇరాక్ కూడా తమ దేశంలో ఉన్న 5,000 మంది అమెరికా సైనికులను వెనక్కు తిప్పి పంపేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఇరాక్ పార్లమెంటు ఒక తీర్మానం ఆమోదించింది. 

అయితే దీనిపై కూడా డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా స్పందించారు. “ఇరాక్‌లో సైనికస్థావరం, విమానాశ్రయం ఏర్పాటుకు మేము బిలియన్ల డాలర్లు ఖర్చు చేశాము. ఇరాక్ ప్రభుత్వం ఆ సొమ్ము చెల్లిస్తే తప్ప మేము అక్కడి నుంచి కదలము. ఒకవేళ ఇరాక్ ప్రభుత్వం మా సైనికులను అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తే మళ్ళీ తీవ్ర ఆంక్షలు విధిస్తాము. కటిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము,” అని హెచ్చరించారు. 

Related Post