సౌదీలో నరకయాతన అనుభవిస్తున్న సిద్దిపేటవాసులు

December 20, 2019
img

పొట్ట చేత్తో పట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారిలో అదృష్టం బాగున్నవారు మంచి కంపెనీలలో ఉద్యోగాలు పొంది జీవితాలలో వెలుగులు నింపుకొంటుంటే, కొందరు దురదృష్టవంతులు మాత్రం ఏజంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాలలో నరకయాతన అనుభవిస్తుండటం, సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్ధిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

సిద్దిపేట జిల్లాకు చెందిన స్వామి, నర్సింలు, అనుమగారి కోటి, సుతారి కనకయ్య, మాట్ల రవిందర్‌లు అటువంటి దురదృష్టవంతులే. వారు సిద్దిపేటలో పొలం పనులు చేసుకొని బ్రతికేవారు. సౌదీలో పడితే డబ్బే డబ్బు అంటూ ఏజంట్ చెప్పిన మాటలు నమ్మి ఏజంటుకు కమీషన్ ముట్టజెప్పి సౌదీలో దిగారు. వారికి తెలిసిన తోటమాలి పనిని ఇప్పిస్తానని ఏజంట్ చెప్పాడు. కానీ వారు సౌదీలో దిగిన తరువాత ప్రమాదకరమైన కెమికల్స్ తయారుచేసే కంపెనీలో పనిచేయవలసిందిగా యజమాని ఆదేశించాడు. వారికి ఆ పనులు చేతకాకపోవడం, ఆ కంపెనీలో వెలువడే విషవాయువులను భరించలేకపోవడంతో వారు ఆ పనిచేయలేమని, తమకు ఏదైనా తోటపనులో లేదా ఇంట్లో పనులో అప్పగించాలని వారు యజమానిని బ్రతిమలాడారు. కానీ ఆ కంపెనీలోనే పనిచేయాలని లేకుంటే స్వదేశానికి తిరిగివెళ్లిపోవాలని యజమాని హుకుం జారీ చేశాడు. వారు సౌదీలో దిగినప్పటి నుంచి ఇంతవరకు సరిగ్గా జీతమే అందుకోలేదు. ఇక విమానం టికెట్ కొనుకొని ఎలా తిరిగి వెళ్ళగలరు? దాంతో నలుగురు తమ రూములోనే ఉండిపోయి యజమానిని రోజూ పని కోసం బ్రతిమలాడుకొంటున్నారు. కానీ తాను చెప్పిన మాట వారు వినందుకు కోపంగా ఉన్న యజమాని వారిని పట్టించుకోవడం మానేశాడు. దాంతో గత నెలరోజులుగా వారు దొరికినప్పుడు తింటూ లేనప్పుడు పస్తులుంటూ ఆకలితో మలమలమాడుతున్నారు. 

వారిలో ఒకరు తమ దయనీయ పరిస్థితి గురించి వివరిస్తూ తన కుటుంబ సభ్యులకు మొబైల్ ఫోన్లో వీడియో మెసేజ్ పంపించారు. వెంటనే వారు సిద్దిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి తమవారిని సౌదీ అరేబియా నుంచి వెనక్కు రప్పించవలసిందిగా కోరారు. భాదిత కుటుంబాలు మంత్రి హరీష్‌రావును కలిసి ఈవిషయం ఆయన దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

Related Post