మాజీ దేశాధ్యక్షుడికి ఉరిశిక్ష!

December 18, 2019
img

పాకిస్తాన్ మాజీ దేశాద్యక్షుడు, మాజీ రిటర్డ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ (76)కు ఇస్లామాబాద్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1999లో సైనిక తిరుగుబాటు చేసి అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలద్రోసి అధికారం హస్తగతం చేసుకొన్నారు. 2001లో పాకిస్తాన్ దేశాద్యక్ష పదవి చేపట్టి 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన పదవీకాలం చివరి రోజులలో దేశంలో రాజకీయ పరిస్థితులు వ్యతిరేకంగా మారుతుండటంతో 2007లో దేశరాజ్యాంగాన్ని రద్దు చేసి, దేశంలో ఎమర్జెన్సీ విధించారు. కానీ పరిస్థితులు చేయి దాటిపోవడంతో తన పదవికి రాజీనామా చేసారు. పాకిస్థాన్‌లోనే ఉంటే జైలుకు వెళ్లవలసి వస్తుందనే భయంతో భార్యకు వైద్యం పేరిట లండన్ వెళ్ళిపోయారు. ఆ తరువాత పరిస్థితులు చక్కబడిన తరువాత మళ్ళీ పాకిస్థాన్‌ తిరిగి వచ్చి 2013 పార్లమెంటు ఎన్నికలలో పోటీకి సిద్దమయ్యారు. కానీ ఆయన అందుకు అనర్హుడని న్యాయస్థానం ప్రకటించడంతో పోటీ చేయలేకపోయారు. 

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన నవాజ్ షరీఫ్ ప్రభుత్వం 2013లో ఆయనపై రాజద్రోహం కేసు వేసింది. ఆ కేసులో పర్వేజ్‌ ముషారఫ్‌ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించినప్పటికీ శిక్ష పడకుండా తప్పించుకొనేందుకు 2014లో చికిత్స కోసమని దుబాయ్ వెళ్ళిపోయారు. స్వదేశానికి తిరిగి వస్తే శిక్ష తప్పదనే భయంతో అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. 

ఆయన అక్కడే ఉన్నప్పటికీ ఇస్లామాబాద్ కోర్టు ఆనాటి కేసుపై విచారణ పూర్తిచేసి ఉరిశిక్ష విధిస్తునట్లు రెండు రోజుల క్రితం తుదితీర్పు ప్రకటించింది. కోర్టు తీర్పుపై పాకిస్థాన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోనే పాక్‌ సైనికులు, ఉగ్రవాదులు కలిసి 1999లో కార్గిల్ చొరబాటుకు ప్రయత్నించడం, దానిని భారత్‌ బలంగా త్రిప్పి కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

Related Post