అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి కమల అవుట్

December 04, 2019
img

వచ్చే ఏడాది జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ అభ్యర్ధిగా బరిలో దిగిన కమలా హారిస్ పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. భారత సంతతికి చెందిన ఆమె సెనేటర్ (ఎంపీ)గా ఎన్నికవడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రాట్ అభ్యర్ధిగా ఎంపికవడంతో ఆమె పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. కానీ అన్ని విదాలా ఆమె కంటే అత్యంత శక్తివంతుడైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొని నిలబడగలరా? నిలబడినా విజయం సాధించగలరా? అనే అనుమానాలు మొదటి నుంచి వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కానీ డెమొక్రాట్ అభ్యర్ధిగా ఎన్నికైనప్పటి నుంచి ఇంతకాలం ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండటంతో చివరి వరకు ఆమె బరిలో నిలిచి ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తారని అందరూ భావించారు. కానీ ఆర్ధిక పరిమితులు, ఇంకా ఇతర కారాణాల చేత అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్లు కమలా హారిస్ మంగళవారం ప్రకటించారు. 

ఇది చాలా కష్టమైన నిర్ణయమే కానీ ప్రస్తుత పరిస్థితులలో ఇంతకంటే వేరే మార్గం లేదని ఆమె అన్నారు. తన అభిమానులను నిరుత్సాహపరిచినందుకు క్షమించవలసిందిగా కోరారు. అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నప్పటికీ ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూనే ఉంటానని కమలా హారిస్ తెలిపారు.

ఆమె బరిలో నుంచి తప్పుకోవడం డెమొక్రెట్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆమె స్థానంలో డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొని నిలబడి ప్రజల ఆదరణ పొందగల మరో బలమైన అభ్యర్ధిని నిలుపవలసి ఉంటుంది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నందున డెమొక్రెట్ పార్టీ ఈ సమస్యను సులువుగానే అధిగమించగలదని భావించవచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020, నవంబర్ 3వ తేదీన జరుగనున్నాయి. 

Related Post