పాక్‌ చెరలో విశాఖవాసి

November 19, 2019
img

పాస్‌పోర్ట్, వీసా లేకుండా పాకిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు భారతీయులను పాక్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ప్రశాంత్ వైందం అనే వ్యక్తి విశాఖపట్నంకు చెందిన వ్యక్తికాగా, వారిలాల్ అనే మరొక వ్యక్తి మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా పాక్‌ పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ అనే ప్రాంతానికి సమీపంలో పాక్‌ సరిహద్దు ఉంది. అటువైపు చోలిస్తాన్ అనే పట్టణంలోకి వారిరువురూ పొరపాటున ప్రవేశించడంతో పాక్ పోలీసులు నవంబర్ 14న వారిని అరెస్ట్ చేసి పాక్‌ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రశాంత్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కావడంతో అతను భారత్‌ తరపున పాక్‌లో గూడచర్యం చేయడానికి వచ్చాడా? అనే కోణంలో పాక్‌ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

భారత్‌-పాక్‌ మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు ఇద్దరు భారతీయులు పాక్‌ చెరలో చిక్కుకోవడం భారత్‌కు చాలా ఇబ్బందికరమే. పాక్‌ చెరలో నుంచి వారిని క్షేమంగా విడిపించుకొని రావడం చాలా కష్టమే. ఈ ఘటనపై భారత్‌ విదేశాంగశాఖ ఇంకా స్పందించవలసి ఉంది. ప్రశాంత్ వైందం పాక్‌ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పోలీసులు తమను కోర్టులో హాజరుపరిచారని, త్వరలోనే తమను విడుదల చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Related Post