ఐసిస్‌ అధినేత అబు బకర్‌ హతం

October 28, 2019
img

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్‌ అల్‌-బాగ్దాది అమెరికా సేనల చేతిలో ఆదివారం సిరియాలో హతం అయ్యాడు. ఈవిషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. బాగ్దాది ఎంతోకాలంగా గాలిస్తున్న అమెరికా నిఘా వర్గాలకు అతను సిరియాలో ఒక ఇంటి అడుగున సొరంగంలో తలదాచుకొన్నట్లు గుర్తించడంతో అమెరికా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. వారి నుంచి తప్పించుకొనే అవకాశం లేకపోవడంతో బాగ్దాది తనను తాను పేల్చివేసుకొని చనిపోయాడని ట్రంప్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో బాగ్దాది ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారని ట్రంప్ తెలిపారు. బాగ్దాది శవానికి వెంటనే డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించి అతను ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్‌ అల్‌-బాగ్దాది అని దృవీకరించుకొన్న తరువాత డొనాల్డ్ ట్రంప్ అతను హతం అయినట్లు స్వయంగా ప్రకటించారు. అయితే అతనిని తమ సేనలు మట్టుబెట్టలేదని అతనే పిరికివాడిలా తనను తాను పేల్చివేసుకొని చనిపోయాడని ట్రంప్ తెలిపారు. ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్న అబు బకర్‌ అల్‌-బాగ్దాది చివరికి భయంతో కుక్క చావు చచ్చాడని ట్రంప్ అన్నారు. ప్రపంచశాంతికి భంగం కలిగించేవారెవరికైనా చివరకు ఇదే గతి పడుతుందని ట్రంప్ అన్నారు.   


Related Post