హ్యూస్టన్‌లో ‘హౌడి మోడి’ సభ గ్రాండ్ సక్సస్

September 23, 2019
img

భారత ప్రధాని నరేంద్రమోడీ గౌరవార్ధం టెక్సాస్ ఇండియా ఫోరం అధ్వర్యంలో అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో హౌడి మోడి (హౌ ర్‌ యు మోడీ?) పేరిట ఆదివారం రాత్రి ఒక భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి భారత్‌-అమెరికాల ‘ఉమ్మడి స్వప్నాలు-దేదీప్యమానమైన భవిత’ ట్యాగ్ లైన్ ఇచ్చారు. 

నిత్యం ఉరుకుల పరుగులతో జీవనం గడిపే ప్రవాసభారతీయులు, అమెరికా వచ్చిన తమ ప్రధాని నరేంద్రమోడీ కోసం తమ రోజువారి పనులు, ఉద్యోగాలు పక్కనపెట్టి వేలాదిమందిగా ఈ సభకు తరలిరావడంతో ‘హౌడి మోడి’ సభ విజయవంతం అయ్యింది. ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఇసుక వేస్తే రాలనంతగా ప్రవాసభారతీయులతో కిక్కిరిసిపోయింది. 

మోడీ-ట్రంప్ వేదికపైకి రాక ముందు నుంచే వారందరూ ‘హౌడి మోడీ...హౌడి మోడీ...’ అంటూ నినాదాలతో స్టేడియంను హోరెత్తించారు. ఆ సభకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సహా 12 రాష్ట్రాల గవర్నర్లు, అనేకమంది అమెరికన్ కాంగ్రెస్‌ (పార్లమెంటు) సభ్యులు హాజరవడం విశేషం. మోడీ-ట్రంప్ ప్రసంగిస్తున్నంతసేపు సభకు హాజరైన ప్రవాసభారతీయులు కరతాళద్వనులతో తమ ఆమోదాన్ని, సంతోషాన్ని తెలియజేస్తూనే ఉన్నారు. 

భారతకాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 10.30 గంటలకు ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో జరిగిన హౌడి మోడీ సభలో ప్రవాసభారతీయులను ఉద్దేశ్యించి ప్రసంగించిన డోనాల్డ్ ట్రంప్‌, ప్రధాని నరేంద్రమోడీ తనకు అత్యంత ఆప్త స్నేహితుడని అన్నారు. భారత్‌-అమెరికాల స్నేహసంబంధాలు ఎప్పుడూ బలంగా నిలిచి ఉన్నాయని, ప్రధాని నరేంద్రమోడీ చొరవ కారణంగా అవి మరింత బలపడ్డాయని అన్నారు. ఈనెల 17న ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు. హౌడి మోడీ సభలో ప్రధాని మోడీకి ట్రంప్ జన్మదినశుభాకాంక్షలు తెలియజేశారు. మోడీ నేతృత్వంలో భారత్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారత్‌ అభివృద్ధిలో అమెరికా పాలుపంచుకొంటుందని హామీ ఇచ్చారు. భారత్‌, అమెరికాలు ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరు సాగిస్తాయని చెప్పారు. 

ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ, “నేను మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు డోనాల్డ్ ట్రంప్‌ తన కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. ఇప్పుడు ఆయనకు నా 130 కోట్ల మంది కుటుంబ సభ్యులను పరిచయం చేస్తున్నాను. మీరే నా కుటుంబం సభ్యులు. భారత్‌-అమెరికాల మద్య ఉన్న బలమైన స్నేహానికి, అనుబంధానికి ఈ కార్యక్రమమే ఒక ప్రత్యక ఉదాహరణ. పరిచయమే అక్కరలేని ప్రముఖవ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌. ప్రపంచ ఆర్ధిక, రాజకీయ, రక్షణ తదితర అన్ని రంగాల తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఏకైక వ్యక్తి డోనాల్డ్ ట్రంప్‌. ఆయన నేతృత్వంలో అమెరికా ఆర్ధికవ్యవస్థ మరింత బలపడి అన్ని రంగాలలో మరింత అభివృద్ధి జరిగింది. కనుక మళ్ళీ ఆయనే మరోసారి అమెరికా అధ్యక్షుడు కావడం ఖాయం. భారత్‌, అమెరికాలో జరిగిన దాడుల మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు. కశ్మీర్‌ విషయంలో మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పొరుగుదేశం (పాకిస్థాన్‌)కు, మన దేశంలో కొంతమందికి మింగుడుపడటం లేదు. సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని ఆ దేశం ఆర్టికల్ 370 రద్దు గురించి రాద్దాంతం చేస్తోంది. ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న పోరులో డోనాల్డ్ ట్రంప్‌తో భారత్‌కు అండగా నిలబడ్డారు. ఇక ముందు కూడా కలిసే ఈ పోరాటం కొనసాగిస్తాము,” అని చెప్పారు.

Related Post