ఉగ్రవాదిలా మాట్లాడిన పాక్‌ ప్రధాని!

September 14, 2019
img

పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ, ఆర్దికసాయం అందజేస్తుందనే సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. బహుశః ఉగ్రవాదులతో చిరకాల సహవాసం కారణంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ కూడా ఉగ్రవాదిలాగే మాట్లాడుతున్నారిప్పుడు. 

శుక్రవారం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజాఫరాబాద్‌లో కశ్మీర్‌(భారత్‌) ప్రజలకు సంఘీభావం తెలుపుతూ జరిపిన ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్‌ మాట్లాడుతూ, “కశ్మీర్‌ ప్రజలకు...స్వాతంత్ర్యం కోసం వారు చేస్తున్న పోరాటాలకు పాకిస్థాన్‌ అండగా నిలబడుతుంది. వారు ఆయుధాలు చేతబట్టి భారత్‌ ప్రభుత్వంతో పోరాటాలు మొదలుపెట్టాలి. బిజెపి, ఆర్ఎస్ఎస్‌ కనుసన్నలలో పనిచేస్తున్న స్థానిక ప్రభుత్వంపై కశ్మీర్‌ ప్రజలు ఆయుధాలతో పోరాటం చేయాలి. అందుకు అవసరమైన సహాయసహకారాలు మేము అందిస్తాము. నేను స్వయంగా కశ్మీర్‌ ప్రజల రాయబారిగా పర్యటించి ప్రపంచదేశాలకు వారి గొంతు వినిపిస్తాను.

భారత్ ప్రభుత్వం మిలటరీని ఉపయోగించి కశ్మీర్‌ ప్రజలను నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తోంది. కానీ భారత్‌ ఎంత ఒత్తిడి చేసినా కశ్మీర్‌ ప్రజలను ఓడించలేదు. వారి మనసులను గెలుచుకోలేదు. ఈ అణచివేతను సహించలేకనే కశ్మీర్‌ యువకుడు బాంబులతో పుల్వామాలో భారత్‌ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేస్తే, పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు దాడులు చేశారంటూ భారత్‌ వాయుసేన బాలాకోట్‌పై దాడులు చేసింది. అప్పుడు మన వాయుసేన భారత్‌ విమానాన్ని కూల్చివేసి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను బందీగా పట్టుకొంది. అతను మనకు బందీగా చిక్కినప్పటికీ మానవతాదృక్పదంతో విడిచిపెట్టేశాము. కానీ అంతర్జాతీయ ఒత్తిళ్లకు మనం తలొగ్గి విడిచిపెట్టామని భారత్‌ ప్రధాని మోడీ చెప్పుకొంటున్నారు. భారత్‌తో మనం యుద్ధం కోరుకోవడం లేదు. కానీ ఈసారి భారత్‌ ఎటువంటి దుస్సాహాసం చేసినా ధీటుగా జవాబు ఇస్తాము. అది ప్రత్యక్ష యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యం లేదు,” అని అన్నారు.    

పాక్‌ పార్లమెంటు ఎన్నికలలో ‘నయా పాకిస్తాన్’ ఆవిష్కరించి చూపుతానని ప్రజలలో ఆశలురేపి ఇమ్రాన్ ఖాన్‌ అధికారం చేజిక్కించుకున్నారు. కానీ పాక్‌ సైనికాధికారులు, ఐఏఎస్ (నిఘా) అధికారులు దేశంలో తిష్టవేసిన 40,000 మంది ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ భారత్‌తో కయ్యానికే మొగ్గు చూపుతున్నారు. కనుక ‘నయా పాకిస్తాన్’ ఆవిష్కరణ ఎన్నటికీ సాధ్యం కాదని ఇమ్రాన్ ఖాన్‌ బాగానే గ్రహించినట్లున్నారు. అందుకే ఆయన కూడా పాక్‌ సైనికాధికారుల ప్రసన్నం చేసుకుని ప్రధాని పదవిలో కొనసాగేందుకు గత పాలకుల బాటలోనే భారత్‌పై ఈవిధంగా విద్వేషం వెళ్ళగ్రక్కతూ కాలక్షేపం చేస్తునట్లున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్‌ గత పాలకుల కంటే మరోమెట్టు కిందకు దిగి ఒక ఉగ్రవాదిలా మాట్లాడటమే విస్మయం కలిగిస్తోంది. సొంత ఇంటికి నిప్పు అంటుకొని తగలబడుతుంటే ఆర్పుకోలేకపోతున్న పాక్‌ పాలకులు, కశ్మీర్‌ ప్రజల సమస్యల కోసం పోరాడుతామని ప్రగల్భాలు పలుకుతుండటం హాస్యాస్పదంగా ఉంది.

Related Post