ఎన్‌ర్‌ఐలకు శుభవార్త!

September 03, 2019
img

ప్రవాసభారతీయులకు ఒక శుభవార్త. ఇప్పటి వరకు వారు ఆధార్ కార్డు పొందాలంటే దేశంలో కనీసం 6 నెలలు తప్పనిసరిగా ఉండాలనే నిబందన ఉండేది. విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేవారికి కేవలం ఆధార్ కార్డు కోసమే భారత్‌లో 6 నెలలు ఉండటం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. వారి సమస్యను గుర్తించిన కేంద్రప్రభుత్వం  ఇప్పుడు ఆ వ్యవధిని 3 నెలలకు తగ్గించాలని నిర్ణయించింది. 

త్వరలోనే ఆధార్ సాఫ్ట్‌వేర్‌లో అందుకు తగ్గట్లుగా మార్పులు చేస్తామని యుఐడిఎఐ సీఈఓ అజయ్ భూషణ్ పాండే చెప్పారు. అంతేకాదు.. ఇక నుంచి విదేశాల నుంచే ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించబోతున్నట్లు తెలిపారు. వారు ఆధార్ కార్డు ఎప్పుడు, ఏ కేంద్రం నుంచి తీసుకోవాలనుకొంటున్నారో ఎంచుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి ఆధార్‌కు దరఖాస్తు చేసుకున్నవారు స్వదేశానికి వచ్చి 90 రోజులలోపు వారు పేర్కొన్న ఆధార్‌ సర్వీస్ సెంటరుకు వెళ్ళి ఆధార్‌ కార్డులు పొందవచ్చని అజయ్ భూషణ్ పాండే తెలిపారు. 

స్వదేశంలో భూములు, ఆస్తులు కొనాలన్నా, బ్యాంక్, వ్యాపార లావాదేవీలు జరుపాలన్నా ఏదో ఓ సమయంలో ఆధార్‌ అవసరం ఉంటుంది. కనుక ప్రవాసభారతీయులకు ఇప్పుడు ఆధార్‌ కార్డు పొందడం సులబతరం అయ్యిందనే చెప్పవచ్చు.

Related Post