ట్రంప్ సంచలన నిర్ణయం అందుకేనా?

August 23, 2019
img

‘అమెరికా ఫస్ట్...అమెరికన్లకే ఉద్యోగాలు...అమెరికన్లకే సంక్షేమ పధకాలు’ అనే నినాదంతో 2016లో అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, అప్పటి నుంచి తన విధానానికి అనుగుణంగానే విదేశీయులపట్ల, వారికి విదేశీకంపెనీల పట్ల కటినమైన చర్యలు తీసుకోంటూ అందరినీ హడలెత్తిస్తున్నారు. ఇప్పటికే, హెచ్-1బీ, హెచ్-4 వీసాలపై రకరకాల ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ తాజాగా అమెరికాలో జన్మించిన విదేశీయుల సంతానానికి పౌరసత్వం లభించకుండా చట్టం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. 

ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “కొందరు విదేశీయులు అక్రమంగా అమెరికాలో చొరబడతారు. ఆ తరువాత సంతానం కంటారు. వారికి ఆటోమేటిక్‌గా అమెరికా పౌరసత్వం వచ్చేస్తోంది. ఇదెక్కడి న్యాయం? అమెరికాలో పుట్టినంత మాత్రన్న చట్టంలోని ‘జన్మహక్కు’ ద్వారా అమెరికా పౌరసత్వం పొందగలగడం సరికాదు. ఈ చట్టాన్ని త్వరలోనే మార్చబోతున్నాము,” అని ట్రంప్ అన్నారు. 

అక్రమవలసదారులకే ఇది పరిమితం చేస్తే ఎవరూ ఆక్షేపించరు కానీ ఉద్యోగరీత్యా అమెరికాకు వచ్చి అక్కడే స్థిరపడిన వారి సంతానానికి కూడా అమెరికన్ పౌరసత్వం ఇవ్వకుండా చేసేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఒకవేళ అదే జరిగితే అమెరికాలో పుట్టిపెరిగి అమెరికానే తమ మాతృభూమిగా భావిస్తూ అమెరికన్లలో కలిసిపోయిన లక్షలాది విదేశీ సంతతి అకస్మాత్తుగా అక్కడ పరాయివారిగా మారిపోతారు. వారందరికీ ఇక అమెరికాలో చదువులు, ఉద్యోగాలు, సంక్షేమ పధకాలకు అనర్హులుగా మారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితులే ఏర్పడితే వారు అక్కడ ఉండలేక తమకు పరిచయం లేని తమ తల్లితండ్రుల దేశానికి వెళ్లలేక చాలా నరకం అనుభవించవలసి వస్తుంది. 

ట్రంప్ ఇంత కటినమైన నిర్ణయం ఎందుకు తీసుకొంటున్నారు? అని ఆలోచిస్తే 2020 నవంబరులో జరుగబోయే అధ్యక్ష ఎన్నికల కోసమేనని అర్ధం అవుతుంది. మళ్ళీ మరోసారి అమెరికన్లలో సెంటిమెంటు రగిల్చి అధ్యక్ష పదవి చేపట్టాలని డోనాల్డ్ ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. కనుక ఈసారి ఎన్నికలలో అమెరికాలో స్థిరపడిన లక్షలాదిమంది విదేశీయులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది.

Related Post