కశ్మీర్‌లో అమెరికా వేలు పెడితే...

July 23, 2019
img

దశాబ్ధాలుగా భారత్‌-పాక్‌ దేశాల మద్య కశ్మీర్ సమస్య నలుగుతోంది. భారత్‌లో కశ్మీర్‌ అంతర్భాగమని భారత్‌ వాదిస్తుంటే, కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కల్పించాలని పాక్‌ వాదిస్తోంది. భారత్‌లో కశ్మీర్ విలీనం విషయంలో నాటి భారత్‌ పాలకుల తప్పుడు నిర్ణయాల కారణంగానే పాకిస్తాన్‌కు ఈ అవకాశం లభించిందని, ఆనాడు చేసిన పొరపాట్ల వలననే కశ్మీర్‌ ఒక (ద్వైపాక్షిక) సమస్యగా ప్రపంచదేశాలు భావిస్తున్నాయనే వాదనలు కూడా వినిపిస్తుంటాయి. 

ఏది ఏమైనప్పటికీ కశ్మీర్ అంశం భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు పాకిస్థాన్‌ ఒక ముల్లుకర్రలా ఉపయోగించుకొంటోందని చెప్పక తప్పదు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఇటీవల అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిసినప్పుడు, కశ్మీర్ సమస్య పరిష్కారానికి మద్యవర్తిత్వం చేయాలని కోరడం, ముందూ వెనుకా చూడకుండా ట్రంప్ అందుకు అంగీకరించి మద్యవర్తిత్వం చేయడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించడంతో భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో అమెరికా వెనక్కు తగ్గి కశ్మీర్ అంశం పూర్తిగా ద్వైపాక్షిక సమస్య అని, దానిని భారత్‌-పాక్‌లే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, వాటికి అవసరమైన సహకారం అందించడానికి అమెరికా ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని అమెరికా అధికార ప్రతినిధి సర్దిచెప్పుకొన్నారు. 

అమెరికా వేలు, కాలు పెట్టిన ఏ దేశమూ బాగుపడలేదని…సర్వనాశనం అయిపోతాయని చరిత్ర తెలియచెపుతోంది. అందుకు వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ తదితర దేశాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. ఈ సంగతి పాకిస్థాన్‌ పాలకులకు తెలియదనుకోలేము. కశ్మీర్ సమస్యలో అమెరికా కాలు, వేలు పెడితే పాకిస్థాన్‌ కొత్తగా నష్టపోయేదేమీ ఉండదు. నష్టపోతే...భారత్‌ నష్టపోతుంది. అందుకే అమెరికాను మద్యవర్తిత్వం చేయాలని పదేపదే పిలుస్తుంటుంది. 

కశ్మీర్‌ విషయంలో ఆనాటి పాలకులు కొన్ని తప్పటడుగులు వేసినప్పటికీ, ఆ తరువాత భారత్‌ను ఏలిన పాలకులు అందరూ కశ్మీర్ అంశంపై ఇతర దేశాలను జోక్యం చేసుకోనీయకూడదనే నిర్ణయానికి ధృడంగా కట్టుబడి ఉండటం అదృష్టమే అనుకోవాలి. లేకుంటే అమెరికా ఎప్పుడో కశ్మీర్‌లో వేలుపెట్టి ఉండేదే. అదే జరిగి ఉండి ఉంటే అప్పుడు పాకిస్థాన్‌తో పాటు అమెరికాతో కూడా భారత్‌ తిప్పలు పడుతుండేదేమో?

Related Post