సౌదీలో 30 మంది కార్మికులు...ఏడాదిగా ఒకే గదిలో బందీ!

July 13, 2019
img

ఒకప్పుడు గల్ఫ్ దేశాలకు వెళ్ళినవారు బాగానే సంపాదించుకున్నారు కానీ ఇప్పుడు అక్కడకు వెళ్ళడం కంటే మన దేశంలోనే ఏదో ఓ ఉద్యోగం లేదా ఉపాది చూసుకోవడం చాలా ఉత్తమం. కానీ గల్ఫ్ దేశాలలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చుననే ఏజంట్ల మాయామాటలు నమ్మి నేటికీ అనేకమంది అప్పోసొప్పో చేసి వారికి బారీగా డబ్బు ముట్టజెప్పి గల్ఫ్ దేశాలకు వెళ్ళి నానాకష్టాలు పడుతున్నారు. 

రాష్ట్రంలోని జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, అదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 50 మంది యువకులు నాలుగేళ్ళ క్రితం సౌదీ అరేబియాలోని డమ్మామ్ కు వెళ్ళి అక్కడ ఒక కంపెనీలో క్లీనర్లుగా చేరారు. సౌదీ చట్టాల ప్రకారం ఆ దేశంలో ఉద్యోగాలు చేయడానికి వచ్చిన వారందరూ ‘అకామా’ అనే ఒక గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. ప్రతీ రెండేళ్ళకు ఓసారి దానిని తప్పనిసరిగా రెన్యువల్ చేయించుకోవాలి. అయితే సదరు సంస్థలే వాటిని రెన్యువల్ చేయిస్తుంటాయి. కానీ వలస కార్మికుల వీసాలకు తగినంత గడువు ఉంటేనే వాటి రెన్యూవల్ అవుతుంది. చాలా మంది కార్మికులు ఏజంట్ల మాయమాటలు నమ్మి 15 రోజుల విజిటింగ్ వీసాలపై లేదా రెండేళ్ళు కాంట్రాక్ట్ వీసాలపై వస్తుంటారు. అటువంటివారికి ఆకామా రెన్యువల్ చేయబడదు. 

వీసా గడువు ముగిసిపోయి, అకమా కార్డులు లేనప్పటికీ చేసిన అప్పులు తీరనందున విధిలేక సౌదీలో దొంగచాటుగా ఉద్యోగాలు చేసుకుంటున్నవారు కొన్ని వేలమంది ఉన్నారు. వారు పోలీసులకు చిక్కితే కొన్నేళ్లు జైలులో పెట్టి ఇంటికి తిప్పి పంపిస్తుంటారు. అటువంటివారి చేత సౌదీలో కొన్ని సంస్థలు, పౌరులు కూడా వెట్టి చాకిరీ చేయించుకొంటుంటారు. ఆవిధంగా చిక్కుకున్న తెలంగాణ కార్మికులందరినీ సదరు కంపెనీ గత ఏడాదిగా ఒక కటకటాల గదిలో బందించి ఉంచింది. సుమారు ఏడాదిగా వారందరూ అదే గదిలో బందించబడి తమను రక్షించే నాధుడి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఆ చెర నుంచి ఎలాగో బయటపడి రాష్ట్రనికి తిరిగివచ్చిన ఒకరిద్దరు వ్యక్తుల ద్వారా ఈ విషయం బయటపడింది. సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ వారినందరినీ కాపాడి వెనక్కు తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Post