తృటిలో ఘోరప్రమాదం నుంచి బయటపడిన ఎయిర్ కెనడా

July 12, 2019
img

ఎయిర్ కెనడా విమానం తృటిలో ఘోరప్రమాదం నుంచి బయటపడింది. స్థానిక కాలమానప్రకారం గురువారం తెల్లవారుజామున కెనడాలోని వాంకోవర్ విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి బయలుదేరిన ఎయిర్ కెనడా (ఫ్లైట్ నెంబర్: ఎసి33) సుమారు రెండు గంటలసేపు ప్రయాణించిన తరువాత విమానం 36,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో విమానం భారీ కుదుపులు వచ్చాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో విమానం హనోలులు విమానాశ్రయంకు సుమారు 966 కిమీ దూరంలో ఉండటంతో విమాన పైలట్లు వెంటనే హనోలులు విమానాశ్రయంలోని గ్రౌండ్ కంట్రోల్ అధికారులతో మాట్లాడి, విమానాన్ని అత్యవసరంగా అక్కడకు మళ్లించి భద్రంగా విమానాశ్రయంలో దింపారు. విమానంలో 15 మంది సిబ్బంది, 269 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో కుదుపులు వచ్చినప్పుడు లోపల ఉన్న ప్రయాణికులలో 37 మంది స్వల్పంగా గాయపడినట్లు కెనడా ప్రభుత్వం అధికార ప్రతినిధి పీటర్ ఫిట్జ్ ప్యాట్రిక్ తెలిపారు. భూమికి 36,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమానం భారీ కుదుపులకు లోనవడంతో ఇక తాము ప్రాణాలపై ఆశలు వదిలేసుకొన్నామని, కానీ అదృష్టవశాత్తు బ్రతికిబయటపడ్డామని ఒక మహిళా ప్రయాణికురాలు అన్నారు. ఈ ఘటనపై సంబందిత అధికారులు తక్షణమే విచారణ ప్రారంభించారు.

Related Post