అమెరికా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలుగు వ్యక్తి

July 03, 2019
img

అమెరికాలో పెన్సల్వేనియా రాష్ట్రంలో కాల్న్ టౌన్‌ పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగువాడైన శ్రీరామమూర్తి కొయ్యలముడి (48) తీవ్రంగా గాయపడ్డారు. రోజూలాగే శుక్రవారం ఉదయం ఆయన తన సైకిలుపై రోడ్డు పక్కన సైక్లింగ్ చేసుకొంటూ వెళుతుండగా, వెనుక నుంచి వేగంగా దూసుకువచ్చిన ఒక కారు బలంగా డ్డీకొనడంతో చాలా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఆయనను స్థానిక పవోలీ ఆసుపత్రికి తరలించారు. 

ఈ ప్రమాదంలో ఆయన తల, భుజాలు, వెన్నెముక, రెండు కాళ్ళు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. చేతులు, కాళ్ళలోని ఎముకలు విరిగిపోవడంతో వైద్యులు వరుసగా అనేక శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇంకా మరికొన్ని క్లిష్టమైన శస్త్ర చికిత్సలు చేయవలసి ఉందని వైద్యులు చెపుతున్నారు. 

శ్రీరామమూర్తి కొయ్యలముడి చాలా చురుకైన వ్యక్తి కావడంతో పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం అందరూ జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ చేయాలని ప్రోత్సహిస్తుంటారు. ఆయన ప్రోత్సాహంతో తెలుగువారితో సహా అనేకమంది అమెరికన్లు కూడా రోజూ జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ చేయడం మొదలుపెట్టారు.  శ్రీరామమూర్తి కొయ్యలముడి స్వయంగా పలు రన్నింగ్ పోటీలలో పాల్గొని గెలిచారు కూడా.

 అందరితో చాలా స్నేహపూర్వకంగా మెలిగే అలవాటున్న కారణంగా తెలుగువారితో పాటు వివిద దేశాలనుంచి అక్కడకు వచ్చి స్థిరపడిన అనేకమంది స్నేహితులు ఆయనకు ఉన్నారు. వారందరూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తూ, ఆయన వైద్యచికిత్సలకు అవసరమైన విరాళాలు సేకరిస్తున్నారు. 

శ్రీరామమూర్తి కొయ్యలముడి భార్య శాంతి రావులపల్లి, వారి పిల్లలు ఈ ఘటనతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారి కుటుంబం ఆయన సంపాదన పైనే ఆధారపడి ఉండటంతో వారి పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారింది. ఒకపక్క భర్త ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతుండగా, ఆమె ఖరీదైన వైద్యం, శస్త్ర చికిత్సల కోసం ఇన్స్యూరెన్స్ కంపెనీలచుట్టూ తిరగవలసి వస్తోంది. ఈ కేసుకు సంబందించిన పోలీస్ కేసు వ్యవహారాలను కూడా చూసుకోవలసివస్తోంది. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు శ్రీరామమూర్తి కుటుంబ స్నేహితులు ఆమెకు అండగా నిలిచి సాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఇంకా స్పృహలోకి రాలేదు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ తమతో ఆనందంగా గడపాలని విదేశీ మిత్రులతో సహా అందరూ దేవుడిని ప్రార్ధిస్తున్నారు. 

శ్రీరామమూర్తి కొయ్యలముడి ఖరీదైన వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం చేయాలనుకునేవారు: https://www.gofundme.com/f/help-murthy-to-run-again ద్వారా సహాయపడవచ్చు.

Related Post