అమెరికాలో తెలుగు కుటుంబం అనుమానాస్పద మృతి

June 17, 2019
img

అమెరికాలో దారుణం జరిగింది. అయోవా రాష్ట్రంలో వెస్ట్ డి మాయిన్ నగరంలోని నివసిస్తున్న ఆంధ్రాకు చెందిన ఒక తెలుగు కుటుంబంలో నలుగురు సభ్యులు అనుమానాస్పదస్థితిలో మరణించారు. సుంకర చంద్రశేఖర్ (44), సుంకర లావణ్య (41), 15,10 సం.లు వయసుకలిగిన వారి కుమారులిద్దరూ వారి నివాసంలో చనిపోయారు. అదే ఇంట్లో నివసిస్తున్న మరో కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారం ప్రకారం, చంద్రశేఖర్ గత కొంతకాలంగా మానసిక ఒత్తిడికి లోనయ్యున్నాడు. ఆ కారణంగా వారి కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. స్థానిక కాలమాన ప్రకారం శనివారం ఉదయం 10.30 గంటలకు చంద్రశేఖర్ తన వద్ద ఉన్న రివాల్వర్‌తో భార్యను, పిల్లలను కాల్చి చంపి ఆ తరువాత అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తల్లితండ్రులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. పోలీసులు వారి శవాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. చంద్రశేఖర్ అమెరికాలో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న వారి జీవితాలు ఈవిధంగా అర్ధాంతరంగా ముగిసిపోవడం చాలా బాధాకరం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Related Post